calender_icon.png 18 July, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర అభ్యంతరాలు చెప్పాం: మంత్రి ఉత్తమ్

19-06-2025 01:59:20 PM

న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి రేవంత్, నేతృత్వంలోని బృందం గురువారం భేటీ అయింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత పోలవరం (గోదావరి)-బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుపై రాష్ట్ర అభ్యంతరాలను సీఎం బృందం తెలియజేసింది.  సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు.

భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజల్లో, రైతుల్లో ఆందోళనలు ఉన్నాయని కేంద్ర జలశక్తి మంత్రికి తెలిపామని, తామ ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని వివరించామని, అనేక తెలంగాణ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టుల కంటే ఏపీ ప్రాజెక్టులకే త్వరగా అనుమతులు ఇస్తున్నారని, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని మంత్రి సీఆర్ పాటిల్ ని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.

అతి త్వరాలో ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని పాటిల్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి , దేశ రాజధానిలో ఏఐసీసీ నాయకులు, ఇతర ప్రముఖులను కూడా కలవనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.