01-05-2025 12:38:28 AM
నిర్మల్ ఏప్రిల్ 30(విజయక్రాంతి): యాసంగి సీజన్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన వారి ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ సంవత్సరం యాసంగి పంట 54 లక్షల 89 వేల ఎకరాల్లో సాగు కాగా, దాదాపు కోటి 37 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అంచనా వేశామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా సుమారు 70 లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని వివరించారు. కొనుగోలు ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ, తూకం, శుద్ధీకరణ యంత్రాలు, టార్పాలిన్ షీట్లు, గన్ని బస్తాలు లాంటి వసతులు సమృద్ధిగా ఉండే లా చూడాలని ఆదేశించారు. తరుగు పేరిట అదనంగా ధాన్యం తీసుకోవద్దని స్పష్టం చేశారు. ధాన్యం రవాణా కోసం తగినన్ని లారీలు సిద్ధంగా ఉంచాలని, కూలీల కొరత లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలన్నారు. గోదాముల పర్యవేక్షణ కూడా నిరంతరంగా కొనసాగించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించామని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి కేంద్రంలో అవసరమైన యంత్రాలు, సామగ్రి అందుబాటులో ఉం చామని వివరించారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తో కలిసి పర్యవేక్షణ చేపడతామని, నిర్ణీత సమయంలో ధాన్యం కొనుగోలు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ సుధాకర్, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఏ డి మార్కెటింగ్ గజానంద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.