18-11-2025 12:00:00 AM
జాబితా విడుదల చేసిన మంత్రి దామోదర రాజనర్సింహా
గడిచిన రెండేళ్లలో 9 వేలకు పైగా పోస్టుల భర్తీ
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్లకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్(గ్రేడ్ పోస్టులకు ఎంపికైనా అభ్యర్థుల జాబితాను సోమవారం మంత్రి విడుదల చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గతేడాది చివరిలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయగా, 24,045 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 23,323 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మంత్రి దామోదర్ రాజనర్సింహా సోమవారం సచివాలయంలో విడుదల చేశారు.
అనంతరం ఎంపికైన అభ్యర్థుల వివరాలు, వారు సాధించిన మార్కుల వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అధికారులు అప్‌లోడ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 వేలకు పైగా పోస్టుల భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ వంటి ముఖ్యమైన పోస్టులతోపాటు, వైద్య సేవలు మెరుగుపర్చేందుకు అవసరమైన ఇతర అన్ని రకాల పోస్టులకూ భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.