01-05-2025 12:07:16 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, ఏప్రిల్ 30: బి ఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 న భూ భారతి చట్టం ముఖ్యమంత్రి ప్రారంభించి 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందని, అనంతరం జిల్లాకి ఒక్క మండలం చొప్పున పరిష్కరించలేని సమస్యలను గుర్తించి భూ భారతి పోర్టల్ లో తగు మార్పులు చేసి తర్వాత జూన్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అమలు చేయనున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. బుధవారం మేళ్లచెర్వు మండల కేంద్రంలో శ్రీ కస్తూరి వెంకటేశ్వర పంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి 2025 చట్టం పై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ధరణిలోని లోపాలను గుర్తించి ఎలా పరిష్కారం చేయాలో కమిటీ ద్వారా ప్రజల, మేధావులు, నిపుణులు ద్వారా అభిప్రాయాలు సేకరించి ముసాయిదాను పబ్లిక్ డోమైన్ లో పెట్టి ప్రజల నుండి అభిప్రాయాలు, సూచనలు సేకరించి భూ భారతి చట్టం రూపొందించారని పేర్కొన్నారు. ధరణి అమలు తర్వాత వి ఆర్ ఓ, వి ఆర్ ఎ లు రద్దు కావటం, తహసీల్దార్ లకి అధికారాలు లేకపోవటంతో చిన్న చిన్న సమస్యలు ఎవరికీ చెప్పాలో తెలియక రైతులు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు.
చిన్న చిన్న సమస్య లకి కోర్టుల చుట్టూ ధరణి వలన రైతులు తిరిగారని, భూ భారతిలో అప్పీల్ వ్యవస్థ చేర్చారని తెలిపారు. మేళ్లచెర్వు మండలంలో 1620 సాదాభైనామా ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాటిని క్రమబద్దికరించి రికార్డులలో నమోదు చేసి వారికి పాస్ పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. త్వరలో రెవిన్యూ వ్యవస్థ బలపర్చేందుకు గ్రామపాలనాధికారులు రాబోతోందని, జూన్ 2 తరువాత భూ సమస్యలు గ్రామ స్థాయి లోనే పరిష్కరించటం జరుగుతుందన్నారు.