13 July, 2026 | 8:23 AM

పరీక్ష కేంద్రాలకు అభ్యర్థుల పరుగో.. పరుగు

09-06-2024 05:41 PM

జిల్లాలో గ్రూప్-1 పరీక్షకు 7692మంది అభ్యర్థులకు 6057మంది హాజరు కాగా 1635 మంది గైర్హాజరు

జగిత్యాలలో గ్రూప్-1 పరీక్ష కేంద్రం ఎదుట ఇన్విజిలేటర్ తీరు నిరసిస్తూ పలువురు అభ్యర్థుల ఆందోళన

జగిత్యాల: నిమిషం ఆలస్యమైనా గ్రూప్-1 పరీక్షను అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు తేల్చిచెప్పడంతో చేసేదేమీ లేక పరుగో.. పరుగు అంటూ అభ్యర్థులు ఆదివారం పరీక్ష కేంద్రాలకు పరుగులు తీశారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల అల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఎదుట ఇన్విజిలేటర్ తీరును నిరసిస్తూ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష వ్రాసేందుకు 7692 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా 6057 మంది హాజరుకాగా 1635మంది   గైర్హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణ కోసం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో పోలీసులు  భద్రతా చర్యలు చేపట్టారు.

జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1  ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు 7692మంది అభ్యర్థులకు 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుండి పరీక్ష వ్రాసేందుకు వచ్చిన అభ్యర్థులు కేంద్రాలకు సమయానికి చేరుకునేందుకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆధ్వర్యంలో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. అన్ని శాఖల అధికారుల సమన్వయం చేసుకుంటూ పరీక్షలకు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష వ్రాసేందుకు పరీక్ష కేంద్రాల వరకు చేరుకునేందుకు సరియైన రవాణా సౌకర్యం లేక కొందరు, అష్టకష్టాలు పడి పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్ష కేంద్రం చేరుకొని అధికారులను ప్రాధేయపడినా లోనికి అనుమతించకపోవడంతో చేసేదేమీలేక అనేక మంది అభ్యర్థులు నిరాశ, నిస్పృహలతో వెనుదిరిగారు.

ఇన్విజిలేటర్ తీరును నిరసిస్తూ గ్రూప్-1 పరీక్ష కేంద్రం ఎదుట అభ్యర్థుల ఆందోళన 

జిల్లా కేంద్రమైన జగిత్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఎదుట గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు ఇన్విజిలేటర్ తీరును నిరసిస్తూ ఆదివారం ఆందోళనకు దిగారు. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం కారణంగా తాము నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థి శరత్ చంద్ర మాట్లాడుతూ  ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో రూం నెంబర్ 213లో 24 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. అయితే ఆ క్లాస్ రూంలో ఉన్న ఇన్విజిలేటర్ ను సమయం అడిగితే ఇంకో అరగంట ఉన్నప్పటికీ చివరి ఐదు నిముషాలు మాత్రమే ఉందని తప్పుతోవ పట్టించినట్లు ఆరోపించారు. దీంతో తాము నష్టపోయామని అదే రూంలో పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ లేకపోవడంతో ఐదు నిమిషాలు మాత్రమే ఉందనుకొని క్వశ్చన్ పేపర్ చూడకుండానే చాలా వరకు ఆన్సర్లు బబ్లింగ్ చేశామని అభ్యర్థులు తెలిపారు. బబ్లింగ్ అనంతరం సుమారు 25 నిమిషాలకు పైగా ఖాళీగా కూర్చున్నామని ఆ తర్వాత అసలు విషయం తెలిసి క్రాస్ చెక్ చేయడం ద్వారా తెలిసిన ఆన్సర్లను కూడా తప్పుగా బబ్లింగ్ చేసినట్లు వాపోయారు. ఈ విషయాన్ని పరీక్ష కేంద్రంలోని అధికారుల దృష్టికి తీసుకు వెళితే మీకు

సమయానికి పేపర్ తీసుకున్నారు కదా?

ఇంకేంటి? ఏమైనా సమస్య ఉంటే చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆరోపించారు. సమయం తెలిసేలా బెల్ కొట్టినప్పటికీ సరిగా వినపడలేదన్నారు. పరీక్ష కేంద్రాలలో కనీసం గోడ గడియారాలు ఏర్పాటు చేయకపోవడంతోనే ఇలా జరిగిందని తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేపడతామని గ్రూప్బీ-1 పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు హెచ్చరించారు.