calender_icon.png 18 October, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లు మా హక్కు

18-10-2025 04:46:11 PM

కుట్రలను చేధించి రిజర్వేషన్లు సాధించుకుంటాం

కాంగ్రెస్ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుంటే ఓర్వలేని బీఆర్ఎస్, బీజేపీ

ఆ రెండు పార్టీల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ వర్గాల సంపూర్ణ మద్దతు

ఇస్నాపూర్ లో రాస్తారోకో

బీసీ మహనీయుల, బీసీ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున్న పాల్గొన్న కాంగ్రెస్, బీసీ శ్రేణులు

స్వచ్ఛందంగా మూతపడ్డ వ్యాపార సముదాయాలు

పటాన్ చెరు: జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు తీసుకునే హక్కు మాకుంది అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బీసీ బంద్‌ లో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో ఆయన బీసీ మహనీయుల, బీసీ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. బీసీ వర్గాలతో కలిసి ఇస్నాపూర్ చౌరస్తాలో జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. 

ఈ బంద్ కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ తమ వ్యాపార సముదాయాలను మూసివేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే ఓర్వలేని కొన్ని పార్టీలు ఆ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కామారెడ్డి లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ కి కట్టుబడి రేవంత్ సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టసభలో బిల్లులు ఆమోదించగా, బీఆర్ఎస్, బీజేపీలు దీనిని ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు అమలైతే తమ పార్టీల స్థానాలు తెలంగాణ లో గల్లంతవుతాయనే భయం రెండు పార్టీలకు పట్టుకుందని విమర్శించారు.నిజంగా బిజెపి పార్టీ కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి, గవర్నర్ల  దగ్గర బీసీ బిల్లు ఆమోదింపచేసి పార్లమెంట్ లో 9వ షెడ్యూల్ లో పెట్టి  మాట్లాడాలని సవాల్ విసిరారు. 

రెండు పార్టీల కపట నాటకాలను బీసీ బిడ్డలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ బీసీలమంతా గల్లీ గల్లీలో లొల్లి పెట్టి కుట్రలను చేధించి మా రిజర్వేషన్లను సాధించుకుంటామన్నారు. ఆ రెండు పార్టీల కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు 'మేమంతో మాకంత' అని గళమెత్తి పోరాటం షురూ చేశానని గుర్తు చేశారు.బీసీల ఐక్యత, సామాజిక న్యాయం కోసం  తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపుకుని బీసీ పోరాటాన్ని ఉదృతం చేసి మా న్యాయమైన హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజకీయంగా న్యాయం చేసేందుకు ప్రయత్నించిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి బీసీ సమాజమంతా అండగా నిలుస్తుందన్నారు. మన  న్యాయబద్ధమైన రిజర్వేషన్ల హక్కులను సాధించుకునే వరకు ఈ పోరాటం కొనసాగిద్దామని ఆయన బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గౌడ్, పటాన్చెరు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గడ్డం శ్రీశైలం, టీపీసీసీ ప్రోటోకాల్ మెంబెర్ ఆదిత్య రెడ్డి, టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్, మాజీ మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సుంకరి రవీందర్, ముత్తంగి అశోక్, ఎంఆర్పీఎస్ నాయకులు గడ్డ యాదయ్య, లింగం, మైలారం పాండు, శ్రీనివాస్, రజక నాయకులు వెంకటేష్, సంజీవ, మైనారిటీ నాయకుడు ఖదీర్, ఎట్టెయ్య, మన్నె రాజు, బీసీ సంఘాల నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు, టీఎంపీఎస్ నాయకులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, ప్రజలు తదితరులు పెద్దఎత్తున్న పాల్గొన్నారు.