18-10-2025 04:40:39 PM
చెన్నూరు ఏడిఏ బానోత్ ప్రసాద్..
మందమర్రి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ పై మండల రైతులు అవగాహన పెంచుకోవాలని వ్యవసాయ శాఖ చెన్నూరు ఏడిఏ బానోత్ ప్రసాద్ కోరారు. శనివారం కపాస్ కిసాన్ యాప్ పై మండలంలోని అందుగులపేట, సారంగపళ్లి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పత్తి రైతులు సీసీఐలో పత్తి అమ్మడానికి గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ కపాస్ కిసాన్ అనే యాప్ ను తీసుకురావడం జరిగిందని, ఈ యాప్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తద్వారా ఈ యాప్ లో ఫార్మర్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, నిజ అమ్మకము అను మూడు దశల్లో ఈ యాప్ ను ఉపయోగించుకోవాలన్నారు.
మొదటి దశ అయిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్లో పంటల వివరాలు నమోదు చేయుట ద్వారా పూర్తి అయిందన్నారు. రెండో దశ అయిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని సమయము తేదీ స్లాట్ బుక్ చేసుకొని మండల పరిధిలోని రైతులకు కేటాయించబడిన సిసిఐ కేంద్రాలలో పత్తి అమ్మకము చేయవచ్చునని అవగాహన కల్పించారు. ఈ స్లాట్ బుకింగ్ సమయంలో రైతులు పట్టాదారు పాసు పుస్తకంతో లింకు ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుందని, ఇట్టి ఓటిపి నమోదు చేయడం ద్వారా స్లాట్ బుక్ అవుతుందని సూచించారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకంతో లింకు ఉన్న మొబైల్ నెంబర్లలో మార్పులు చేర్పులు ఉన్నట్లయితే వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద ఏఈఓ లాగర్ ఆప్ యందు మార్పులు చేర్పులకు అవకాశం ఉందని కావున ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అదే విధంగా వరి కోతలను పూర్తిగా ఆరిన తర్వాత వరి కోతలను చేపట్టాలని, హార్వెస్టర్ బ్లోయర్ ఆన్ చేయాలని, పంక వేగం 18 నుంచి 20 ఆర్ పి యం మధ్య ఉంచాలని, ఈ విధంగా చేయడం ద్వారా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావడానికి అవకాశం కలుగుతుందని తద్వారా కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, సైండ్ల కనకరాజు, ఆయా గ్రామాల రైతులు రాచకొండ కమల మనోహర్ రావు, ఫిరోజ్, బండి మహేందర్, కాసర్ల ప్రశాంత్, మహేందర్, గుడి మహిపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.