31-07-2025 12:00:16 AM
మాజీ ఎంపీ వినోద్ కుమార్
హైదరాబాద్ (విజయక్రాంతి): ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తలచుకుంటే పార్లమెంటులో రిజర్వేషన్ల పెంపును గంటలో ఆమోదించవచ్చని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్(Former BRS MP Vinod Kumar) అన్నారు. అయితే మోడీకి చిత్తశుద్ధి లేదని, రాహుల్ గాంధీ అడగరని ఆయన అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ బీజేపీలు బీసీలను ఎందుకు మోసం చేయాలని చూస్తున్నాయన్నారు.
50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు, రాజ్యాంగం 243డి కు సవరణ చేస్తే బీసీ ల రిజర్వేషన్లు పెంచవచ్చన్నారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయవచ్చన్నారు. జీవో, ఆర్డినెన్స్‌ల ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం గా చేస్తామంటున్నారని, బీసీలకు రిజర్వేషన్లు పెంచని వారు బీసీని సీఎం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.