14-12-2025 02:42:48 PM
మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పిటి గ్రామంలో కొట్టుకున్న నాయకులు
ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు...
మనోహరాబాద్ : రెండవ విడత గ్రామ పంచాయతీల ఎన్నికలలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఎన్నికలు జరిగాయి. మండలంలోని కోనాయిపల్లి పిటి గ్రామంలో కాంగ్రెస్, బిజెపి పార్టీకి చెందిన ఇరు వర్గాలు ఘర్షణపడి కొట్టుకున్నారు. ఇది గమనించిన పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. పోలింగ్ సెంటర్ వద్ద ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు తమకంటే తమకు ఓటు వేయాలని ఓట్లను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తరుణంలో ఇరు వర్గాల నాయకులు ఘర్షణలకు దిగి ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగి కొట్టుకున్నారు.
ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ తూముకుంట నర్సారెడ్డి వర్గంకు చెందిన సర్పంచ్ అభ్యర్థి మన్నె కళ్యాణ్ ముదిరాజ్ ను బలపరిచారు. ఈ అభ్యర్థికి కాంగ్రెస్ నాయకులు మాజీ మండల రైతు సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఆయన సోదరులు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డిలు మద్దతుగా ఉన్నారు. అలాగే బిజెపి నాయకుడు భాష బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈయనకు మద్దతుగా బిజెపితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సొసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, మల్కాజిగిరీ మాజీ ఎమ్మెల్యే మైలంపల్లి హనుమంతరావు వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా ఉండి ప్రచారం నిర్వహించారు.