04-11-2025 12:27:26 AM
							-జూబ్లీహిల్స్‌లో ప్రచార జోరు పెంచిన కమలం
-ఇంటింటి ప్రచారం.. బైక్ ర్యాలీ
-అసలైన అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
-ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ డివిజన్లలో కిషన్ రెడ్డి ప్రచారం
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మార్పు మొదలైందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మోసపూరిత రాజకీయాలకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధం గా ఉన్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ తీర్పుతో రెండు కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లో ఇం టింటి ప్రచారం చేశారు. శీనగర్ కాలనీ డివిజన్ లో కి బైక్ ర్యాలీ నిర్వహించారు.
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపును కాంక్షి స్తూ ఎర్రగడ్డ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో కార్యకర్తలతో కలిసి కిషన్‌రెడ్డి ఇంటింటా తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాల ని ఓటర్లను కోరారు. రాజీవ్‌నగర్, కళ్యాణ్ నగర్, జయంతినగర్ బస్తీల్లో ఆయన విస్తృ త ప్రచారం నిర్వహించారు. స్థానిక బీ జేపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతి గడపకూ వెళ్లి, ఓటర్లను ఆప్యాయంగా పలకరి స్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంది స్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రధానమం త్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఆ ఫలాలు స్థానికంగా అందాలంటే బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు, స్థా నిక నాయకు జయజయధ్వానాలతో ఎర్రగడ్డ వీధులు హోరెత్తాయి.
శ్రీనగర్ కాలనీ డివిజన్‌లోకి బైక్ ర్యాలీలో నిర్వహించిన సభ లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్, కాం గ్రెస్ పార్టీల పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను నట్టేట ముంచిందని విమర్శించారు. ‘రైతులకు రుణమాఫీ ఏమైంది. నిరుద్యోగ యువతకు భృతి ఎక్కడ. మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి’ అని ప్రజలు అడుగుతుంటే ముఖ్యమంత్రి నుంచి సమాధానం లేదన్నారు. కేవలం పథకాల పేర్లు మార్చి, కేంద్ర ప్రభుత్వ పథకాలకు తమ స్టిక్కర్లు అం టించుకుంటున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, కేవలం ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకే నాణేం బొమ్మాబొరుసు లాంటివని విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ర్టంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ‘డబుల్ ఇంజిన్ సర్కార్’తో అభివృద్ధి పరుగులు పెడుతుందని భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, కుటుంబ, అవినీతి పార్టీలను తిరస్కరించి, అభివృద్ధికి చిరునామా అయి న బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.