26-07-2025 03:14:32 PM
మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్
కామారెడ్డి,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పిఎం కిసాన్) డబ్బులు రైతులందరికీ ఇవ్వాలని కామారెడ్డి జిల్లా దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా దోమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 సంవత్సరం నుండి పాస్ బుక్ వచ్చిన రైతులకు అందడం లేదు. 2018 వరకు పొందిన రైతుల పాసు బుక్కులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మన్ డబ్బులు అందజేస్తున్నారని తెలిపారు. నూతనంగా భూమి కొనుగోలు చేసి పాసుబుక్కులు పొందిన రైతులకు పీఎం కిసాన్ సమ్మన్ నిధి అందేటట్లు చూడాలి అని మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా పథకాలు నూతనంగా భూమి కొనుగోలు చేసి పాసుబుక్కు పొందిన రైతులందరికీ అందజేస్తున్నదని. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం పీఎం సన్మాన్నిధి డబ్బులు కొత్తగా పాస్ బుక్ లు పొందిన రైతులకు అందే విధంగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019 నుండి పాసుబుక్కులు పొందిన రైతులకు పీఎం సన్మాన్నిధి డబ్బులు ఇవ్వకపోవడం రైతులకు అన్యాయం చేసినట్లే అని ఆయన అన్నారు.