calender_icon.png 27 July, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే ‘పాడి’పై కాంగ్రెస్ ఫిర్యాదులు

27-07-2025 01:17:48 AM

- బంజారహిల్స్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు

- హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కలకలం 

- కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్

శేరిలింగంపల్లి/రాజేంద్రనగర్, జూలై 26: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. “హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నాడు. సీఎం ప్రైవేట్ హ్యాకర్లతో కలిసి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు” అంటూ ఆయన చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ మహిళా నేత కల్వ సుజాత ఫిర్యాదు చేయగా, శనివారం రాజేంద్రనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మరో ఫిర్యాదు చేశారు.

తాజగా పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్‌ఎస్‌యూఐ సభ్యులు ఇంటి ముట్టడికి పిలుపునివ్వగా, మరోవైపు కౌశిక్‌రెడ్డికి మద్దతుగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. అప్పటికే ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టారు.