25-09-2025 01:26:41 AM
సీఎం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పుస్తకాల ముద్రణ
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): సిలబస్‌లోని మూసపద్ధతికి ఇంటర్ బోర్డు చెక్ పెట్టనుంది. ఏండ్ల తరబడిగా ఉన్న పాత సిలబస్‌ను మార్చబోతోంది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులు పోటీని తట్టుకొని నిలబడి రాణించేలా కొత్త సిలబస్‌ను ఇంటర్ బోర్డు అధికారులు రూపొందిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని తీసుకురానున్నారు.
ఇంటర్మీడియట్ విద్యలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో దాదాపుగా 8 నుంచి 12 సంవత్సరాలుగా పాత సిలబస్సే బోధిస్తున్నారు. దీంతో ప్రస్తుతమున్న మార్కెట్, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కుక్కునే అవకాశం చాలా తక్కువ. ఈ క్రమంలోనే సిలబస్ మార్పుపై ఇంటర్ బోర్డు కార్యదర్శి దృష్టిసారించి కొత్త సిలబస్‌ను చేర్చనున్నారు. మార్పులు చేసే కొత్త సిలబస్‌ను 2026 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురా నున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
అవసరంలేని సిలబస్ తొలగింపు..
ఇంటర్ కోర్సుల్లోని వివిధ సబ్జెక్టుల్లో అవసరంలేని, పాత సిలబస్‌ను తొలగించనున్నా రు. కొత్త సిలబస్ అన్ని గ్రూపుల్లో మర్చనున్నారు. కొన్ని సబ్జెక్టుల్లోని సిలబస్ వార్షిక పరీక్షలు, ఎప్‌సెట్, జేఈఈ, నీట్ లాంటి పలు ఎంట్రెన్స్ టెస్టుల్లో రాని టాపిక్‌లను గుర్తించి వాటిని తొలగించనున్నారు. ఇప్పటికే సిలబస్‌ను సిద్ధం చేసి ఉంచారు. సీఎం రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించిన ఫైలును కూడా ఇంటర్ బోర్డు అధికారులు పంపించారు.
ఆయన అనుమతి ఇచ్చిన వెంటనే పుస్తకాలను ముద్రించి వచ్చే విద్యాసంవత్సరానికి సిద్ధంగా పాఠ్యపుస్తకాలను ఉంచను న్నారు. ఈ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్‌ను సైతం ముద్రిస్తున్నారు. ఇటీవల ఇంటర్ బోర్డు కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య రావడంతో సిలబస్‌పైన ఆయన దృష్టిసారించి మార్పులు చేయాలని చర్యలు చేపట్టారు.
ఎక్కువగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలిజీ, కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీలో సిలబస్‌ను తగ్గించే అవకాశముంది. దీంతో పాటు పదో తరగతిలో తరహాలోనే ఆర్టిఫిషియల్ ఇంటిలి జెన్స్, రోబోటిక్స్, డేటాసైన్స్, మిషన్ లెర్నిం గ్, డిజిటల్ సాంకేతికను వివరించే పాఠ్యాంశాలను అందుబాటులోకి తేనున్నారు.
పెరిగిన అడ్మిషన్లు...
గతేడాది కంటే ఈసారి ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్లు పెరిగాయి. 2024 విద్యాసంవత్సరలో 83,635 అడ్మిషన్లు ఇంటర్ మొదటి ఏడాదిలో నమోదు అయితే, ఈ విద్యాసంవత్సరం 91,853 అడ్మిషన్లు నమోదయ్యాయి.
గతంలో కంటే ఈ ఏడాది 8,218 అడ్మిషన్లు అత్యధికంగా నమోదయ్యాయి. అయితే కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోని కాలేజీలకు రాని విద్యార్థుల వివరాలను అధికారులు సేకరించనున్నారు. తర్వాత వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కాలేజీలకు వచ్చేలా చర్యలు చేపడుతున్నారు.