04-10-2025 02:57:08 PM
దామన్న మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.
దామన్న పార్థివ దేహానికి మంత్రులు ఘనంగా శ్రద్ధాంజలి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, అశేష ప్రజానిక మధ్య, అంత్యక్రియలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా నాయకునిగా రాణించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి(Ram Reddy Damodar Reddy) మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి(73) నివాసములో ఆయన భౌతిక కాయాన్ని ఏర్పాటు చేయగా, కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చూస్తూ ఏడుస్తూ కన్నీటి పర్వంతమయ్యారు. ఆయన భౌతికకాయంపై మంత్రులు ఎమ్మెల్యేలు, అధికారులు, అభిమానులు పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి ఘటించారు.
1952 సంవత్సరములలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మించి, విద్యాభ్యాసం నిర్వహించారు. 1969 సంవత్సరంలోనే రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదిగి, అంచలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో రాణించారు. 1986 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తుంగతుర్తిలో కమ్యూనిస్టు పార్టీపై ఎమ్మెల్యేగా నిలిచి, కమ్యూనిస్టులతో పోరాడి గెలిచారు. మొత్తం 5 పర్యాయాలు, ఎమ్మెల్యేగా, 2 మార్లు క్యాబినెట్ మంత్రివర్గంలో స్థానం సంపాదించి, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో వేల కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసిన ఘనత దామోదర్ రెడ్డికి దక్కింది. గడిచిన 40 సంవత్సరాలుగా ఎంతోమంది కార్యకర్తలు రాజకీయ నాయకులుగా తీర్చిన ఘనత ఆయనదే అని వారు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం బాధాకర విషయం అని అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండి, అక్టోబర్ 1 హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో శక్తి వంచన లేకుండా కృషి చేసిన నాయకునిగా పేర్కొనవచ్చు అని పలువురు అభివర్ణించారు.
తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల ప్రజల సందర్శన కోసం3 వ రోజు, సూర్యాపేటలో 4 న తుంగతుర్తిలో అశేష ప్రజానిక మధ్య, తన వ్యవసాయ క్షేత్రంలో, అధికార లాంచనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. దీనితో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు దామన్న అమరహై.. జై కాంగ్రెస్, టైగర్ దామన్న నినాదాలతో మారుమోగింది. దామన్న శకం ముగిసిందని నియోజకవర్గ కార్యకర్తలు ఆవేదనకు గురయ్యారు. సూర్యాపేట ఎస్పీ నరసింహ, పర్యవేక్షణలో, డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో తుంగతుర్తిలో భారీ బందోబస్తు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు, ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం, యశస్విని రెడ్డి, రవీందర్ నాయక్, రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యం, కోటిరెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టి పి సి సి ఉపాధ్యక్షులు బోయినపల్లి రేఖ, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, టీ పీసీసీ నాయకులు గుడిపాటి నరసయ్య, అనపర్తి జ్ఞాన సుందర్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, ప్రముఖ పారిశ్రామికవేత్త సంకినేని కృష్ణారావు, నియోజకవర్గ నాయకులు ,మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.