04-10-2025 05:38:42 PM
బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని, గ్రామకమిటీలు, వార్డు కమిటీలను అప్రమత్తం చేసి పోటీ చేసిన ప్రతి స్థానంలో సిపిఐ అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి కార్యకర్త తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో జరిగిన లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, మండలాల ముఖ్య నాయకుల సమావేశానికి అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు, జిల్లాలో సిపిఐని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు, కార్మికుల పక్షాన సిపిఐ, అనుబంధ ప్రజా, కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న పోరాటాలే సిపిఐ అభ్యర్థుల గెలుపుకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.
ఎన్నికల సమన్వయంతో వచ్చే పార్టీలు, రాజకీయ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, నిత్యం ప్రజల్లో మమేకమయ్యే పార్టీ సిపిఐ ఒక్కటేనని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూనంనేని చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చట్టసభల్లో అన్నివర్గాల ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిస్కారం కోసం కూనంనేని చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సర్పంచి, ఎంపిటిసి, ఏడిపిటిసి అభ్యర్థుల ఎంపిక బాధ్యత మండల, గ్రామ కమిటీలదేనని, ఈ ఎంపికలో ఎలాంటి వత్తిళ్లకు తావివ్వొద్దని సూచించారు. బలమైన అభ్యర్థులను, ప్రజల్లో ఉండే వారిని ఎంపిక చేసి పోటీలో నిలబెట్టి గెలిపించుకోవడం ద్వారా ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని గుర్తించాలన్నారు.
డిసెంబర్ 26న ఖమ్మం నగరంలో సిపిఐ శత వసంతాల ముగింపు బహిరంగ సభ, ఉత్సావాలు నిర్వహిస్తున్నామని, బహిరంగ సభ విజయవంతం కోసం, ఆదివారం ఖమ్మంలో ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని, ఆహ్వానసంఘం సమావేశాన్ని పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలనీ సూచించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, భూక్య దస్రు, మండలాల కార్యదర్శులు ధీటి లక్ష్మీపతి, కోమారి హన్మంతరావు, జిల్లా సమితి సభ్యులు గుత్తుల సత్యనారాయణ, ధనలక్ష్మి, జక్కుల రాములు, రత్నకుమారి, తాళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొంమరు.