03-05-2024 12:56:32 AM
లోక్‌సభ ఎన్నికల్లో మారుతున్న ప్రచారాస్త్రాలు
వాటి కేంద్రంగానే ప్రచారం నిర్వహిస్తున్న నేతలు
బీజేపీ రాజ్యాంగం మారుస్తుందంటున్న కాంగ్రెస్
బంగారం లాక్కుంటుందంటూ కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణ
రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ దుయ్యబాటు
ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తుందంటున్న బీజేపీ
న్యూఢిల్లీ, మే 2: దేశంలో ఎన్నికల జాతర సాగుతోంది. మొత్తం ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తయింది. మూడో విడత పోలింగ్ మే 7వ తేదీన జరగనుంది. ఎన్నికలు అనగానే రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెడుతూ.. దుమ్మెత్తిపోసుకుంటూ వేడి పుట్టి స్తున్నారు. అయితే కాదేదీ కవితకనర్హం అన్న ట్టు.. ఎన్నికల ప్రచారానికి ఏ అంశమూ అనర్హమైనది కాదు. ఏదో ఒక అంశాన్ని తీసుకుని రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటాయి. ప్రస్తుత ఎన్నికల్లో కూడా కూడా అలాంటి ఎన్నో అంశాలను ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లేవనెత్తుతున్నాయి. రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రత్యర్థి పార్టీలు, నేతలపై తీవ్రం గా విరుచుకుపడుతున్నారు. ఈ అంశాల కేంద్రంగానే ప్రచారం సాగిస్తున్నా రు. ముఖ్యంగా రాజ్యాంగం, రిజర్వేషన్లు ప్రధా నాంశాలుగా మారాయి. వీటి చుట్టూ రాజకీయ నాయకుల విమర్శలు నడుస్తున్నాయి.
రాజ్యాంగం మారుస్తారా..?
400 లోక్‌సభ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. అయితే బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం రచించింది. బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందంటూ ప్రచారం చేస్తోంది. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలందరూ ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు. దీనికి తోడు కొందరు బీజేపీ నేతలు గతంలో రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు ఆత్మ రక్షణలో పడ్డట్టు కనిపిస్తున్నది. తనకు రాజ్యాంగం ఎంతో పవిత్రమైనదని, రాజ్యాంగమే అత్యున్నతమైనదని ఇటీవల తెలంగాణలోని జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ స్ఫష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 60 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఉత్సవంగా జరిపిన ఏకైనా సీఎంను తానేనని గుర్తు చేసుకున్నారు. అంతగా తాను రాజ్యాంగానికి విలువ ఇస్తానని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని చించేస్తారు..!
అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం మార్పును ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుని, బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం మరోసారి వస్తే రాజ్యాంగాన్ని చించేస్తారు.. పారేస్తారు.. అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల వారి హక్కులను బీజేపీ కాలరాసేందుకు కుట్రపన్నుతోందని దుయ్యబడుతున్నారు. ఈ ఎన్నికల్లో మరో ప్రచారాస్త్రం రిజర్వేషన్లు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగించే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే దీన్ని అధికార బీజేపీ కొట్టిపారేస్తోంది.
మంగళసూత్రాలు లాక్కుంటారు
ఇక తన మ్యానిఫెస్టోలో కుల, ఆర్థిక గణన చేస్తామని కాంగ్రెస్ పొందుపరిచింది. దీనిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తల్లులు, చెల్లెళ్ల మం గళసూత్రాలు సహా బంగారాన్ని లాక్కుంటుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అది ఎంతవరకు నిజమో కానీ కాంగ్రెస్ మాత్రం దీన్ని తప్పు అని నిరూపించేందుకు నానా తంటాలు పడింది. 70 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉందని, ఎప్పుడైనా బంగారం లాక్కుందా అంటూ డిఫెండ్ చేసుకుంది కాంగ్రెస్.