25 August, 2026 | 3:32 PM

Breaking News

అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •   నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి   •   పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి   •   వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి   •   మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •  

హీటెక్కిన కాంగ్రెస్ వార్

30-06-2025 02:52 AM
  1. వరంగల్‌లో ముదురుతున్న పొలిటికల్ వైరం
  2. ‘కొండా’కు వ్యతిరేకంగా నేతల సమావేశం 
  3. ఎమ్మెల్యే నాయిని క్యాంపు కార్యాలయంలో భేటీ
  4. ఎమ్మెల్యే రేవూరి, ఎమ్మెల్సీ సారయ్య, కూడా చైర్‌పర్సన్ హాజరు
  5. క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఇచ్చిన లేఖపైనే చర్చ?

వరంగల్, జూన్ 29 (విజయక్రాంతి): వరంగల్ కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్  మరిం త హీట్ ఎక్కింది. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు గత కొంతకాలంగా స్టేషన్ ఘనపూర్, పరకాల ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈ అంశంపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కొండా మురళి వ్యతిరేక వర్గ కాంగ్రెస్ నేతలు దంపతుల వైఖరిపై పీసీసీ, క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో శనివారం కొండా మురళి గాంధీభవన్‌కు వెళ్లి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిసి పార్టీ నేతలపై తమకు ఎంతో గౌరవం ఉందని, అయితే తమను ఇబ్బంది పెట్టే విధంగా వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారి వైఖరిని తప్పుపడుతున్నామే తప్ప పార్టీపై, సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంతో గౌరవం అని, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరు పేజీల లేఖను అందజేశారు. అయితే వారం రోజుల్లో ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ నోటీసు జారీ చేసింది.

ఇదిలా ఉంటే ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాగిని రాజేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కూడా చైర్ పర్సన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొందరు జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రత్యేకంగా బేటి అయ్యారు. కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి అందజేసిన లేఖలోని అంశాలపైనే చర్చించినట్లు ప్రచారం సాగుతోంది. ఆరు పేజీల లేఖలో కొండా మురళి ఏయే అంశాలు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారు, వాటిపై తాము ఎలా స్పందించాలని అని చర్చించినట్లు తెలుస్తున్నది.

క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేస్తే.. సంజాయిషీ ఇవ్వకుండా, తమపై ఫిర్యాదు చేయడం ఏమిటని, ఈ వ్యవహారంపై అధిష్ఠానానికి, క్రమశిక్షణ కమిటీకి కలిసికట్టుగానే ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే శనివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. కొండా మురళిని ఉద్దేశిస్తూ తీవ్ర పదజాలంతో మాట్లాడటం పొలిటికల్ వార్‌కు మరింత ఆజ్యం పోసినట్టుగా చెపుతున్నారు. ఈ నేపథ్యంలో కొండా మురళి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారని, ఆయనపై గట్టిగానే ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నేతల బేటీలో నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో జనగామ మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా ఉన్నదనుకున్న నేపథ్యంలో కొండా వర్సెస్ ఇతర ఎమ్మెల్యేల ఫిర్యాదుల వ్యవహారం రచ్చకెక్కడంతో అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం  కలిగించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.