23-01-2026 12:00:00 AM
చండూరు, జనవరి 22: చండూరు మున్సిపాలిటీలో మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోటో ఉన్న స్కార్పియో పై మంత్రి రాజన్న అని రాసి మున్సిపాలిటీ వీధుల్లో చక్కర్లు కొడుతూ హల్చల్ చేసినట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజులుగా మున్సిపాలిటీలో ఇదే తంతు కొనసాగుతున్నట్లు విమర్శలు చేస్తున్నారు. ఇది మా రాజన్న అడ్డా అంటూ తాము అడిగినప్పుడల్లా మద్యం ఇవ్వాల్సిందే అని భయపెడుతూ బుధవారం స్థానిక యూనియన్ బ్యాంకు ముందు నుండి అతివేగంగా వెళ్లి వెనకాల ఉన్న వైన్స్ గేటును గుద్దుకుంటూ లోపలికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
మిమ్మల్ని ఇక్కడ వైన్స్ ఎవరు పెట్టమన్నారు, తాము రాజన్న అనుచరులమంటూ ఇక్కడ వైన్ షాప్ పెట్టినందుకు తమకు డబ్బులు ఇవ్వాలంటూ వైన్ షాపులో పనిచేసే కస్తాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై పిడిగుద్దులతో దాడి చేసినట్లు తెలిపారు. ఇది మా రాజన్న అడ్డా.. తాము మద్యం అడిగినప్పుడల్లా ఇవ్వాలి. లేకపోతే మేమేంటో చూపిస్తామని బెదిరించినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. మద్యం దుకాణం నిర్వాకులు డయల్ 100కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ఎంత వారించిన వినకుండా పోలీసులనే అసభ్యంగా దూషించినట్లు సమాచారం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ పరిస్థితులు తెలుసుకొని వారిని కట్టడి చేయకపోతే ప్రశాంతంగా ఉండే మున్సిపాలిటీ ఇబ్బందికరంగా మారుతుందని చర్చలు సాగుతున్నట్లు వినికిడి.