23-01-2026 12:00:00 AM
నల్గొండ క్రైం, జనవరి 22: యాదాద్రి జోన్5 పరిధిలోని పోలీస్ స్పోరట్స్, గేమ్స్ మీట్2026 జోనల్ టీం ఎంపికను జిల్లా పోలీస్ క్రీడా మైదానంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌గురువారం ప్రారంభించారు. జోనల్ సెలక్షన్స్కు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది హాజరై తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.
ఎంపికలో భాగంగా 40 రకాల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించగా 100, 200, 400, 800, 1600 మీటర్ల పరుగులు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పరుగులు, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, హైజంప్, లాంగ్ జంప్, షాట్పుట్, షటిల్ తదితర క్రీడల్లో పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు. యాదాద్రి జోన్5 పరిధిలోని మూడు జిల్లాల నుంచి 320 మంది పోలీస్ క్రీడాకారులు జోనల్ సెలక్షన్స్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో నుంచి ఫిబ్రవరి 2 నుంచి హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోలీస్ స్పోరట్స్, గేమ్స్ మీట్కు 140 మంది పోలీస్ క్రీడాకారులను ఎంపిక చేసినట్లుఎస్పీ తెలిపారు.
పోలీసు వృత్తిలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా, పోలీస్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, సమన్వయం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభను కనబర్చి, యాదాద్రి జోన్5కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పి వినోద్, అడిషనల్ ఎస్పి రమేష్,ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు,ఎస్బి సిఐ రాము,ఆర్.ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, నరసింహ,కళ్యాణ్ రాజ్, సురేష్,ఆర్.ఎస్.ఐ సాయి రాం,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.