2 July, 2026 | 2:37 AM

డీడీఎన్ అర్చకుల్లో చీలికలు తెచ్చే కుట్రలను తిప్పికొట్టాలి

02-07-2026 01:40 AM

మహబూబాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ధూప దీప నైవేద్య (డిడిఎన్) అర్చకుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర సంఘంపై కొందరు స్వార్థపరులు కులం రంగు పులిమి, అర్చక లోకంలో చీలికలు తేవాలని చూడటం అత్యంత విచారకరమని, ‘ఐకమత్యమే మహాబలం’అనే సత్యాన్ని విస్మరించి, వ్యక్తిగత అజెండాలతో సంఘాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న శక్తుల పట్ల అర్చక సమాజం అప్రమత్తంగా ఉండాలని డి డి ఎన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు లింగోదు వెంకటేశ్వర ఆచార్యులు పేర్కొన్నారు.

గతంలో ఉన్నత స్థానాల్లో చలామణి అయిన కొందరు పెద్దలు సామాన్య డిడిఎన్ అర్చకులను కేవలం తమ స్వార్థం కోసం వాడుకున్నారే తప్ప, ఏనాడూ వారి ఆర్థిక భద్రతను పట్టించుకోలేదన్నారు. నేడు రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ స్వయంగా ఒక డిడి ఎన్ అర్చకుడు కాబట్టి, ప్రతి ఒక్కరికీ వేతనం పెరగాలనే తపనతో అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.

గతంలో 680 పోస్టులు వచ్చే అవకాశం ఉన్న చోట, పట్టుబట్టి ఏకంగా 1,216 పోస్టులు ఇప్పించిన ఘనత ఆయనదని, బ్రాహ్మణేతరుల పోస్టుల గురించి అడిగినప్పుడు కూడా మేమంతా అర్చకులం, కులాల వారీగా విభజన వద్దనితన కులాతీత నాయకత్వాన్ని చాటుకున్నారన్నారు. ప్రస్తుతం మన సంక్షేమం కోసం, నెలకు 35 వేల వేతన పెంపు కోసం పోరాడుతున్న ఆయన నాయకత్వాన్ని బలహీనపరచుకోవద్దన్నారు. అందరం కలిసికట్టుగా ఉండి మన హక్కులను సాధించుకుందాం, అర్చక ఐక్యతను కాపాడుకుందామని ఆయన అన్నారు.