23-12-2025 03:25:14 PM
ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరి చిరంజీవి
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని సీహెచ్సీ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు మరియు ఇతర ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఏవో కిరణ్ కుమార్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ... వాంకిడి మండలంలోని సీహెచ్సీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు గత మూడు సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటూ, ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని తెలిపారు.
గత ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబాలను పోషించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. భీమ్ ఎస్సీ & ఎస్టీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ కాంట్రాక్టర్ను పలుమార్లు అడిగినా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప వేతనాలు చెల్లించడం లేదని విమర్శించారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలను చెల్లించాలని, ఇక నుంచి ప్రతి నెల 5వ తేదీలోపు బ్యాంక్ ద్వారా వేతనాలు జమ చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించి పూర్తి వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులకు గుర్తింపు కార్డులు, జాతీయ సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాంజీ, దినకర్, చంద్రశేఖర్, రాధిక, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.