calender_icon.png 23 December, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తులపై అవమానాలు

23-12-2025 03:17:19 PM

అనధికారుల పెత్తనం, బోర్డు వైఫల్యం

సనత్‌నగర్,(విజయక్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో అధికారిక సభ్యులు కాకపోయిన కొందరు వ్యక్తులు, తాము ఆలయ నిర్వహణకు చెందిన సభ్యులైనట్టుగా ప్రవర్తిస్తూ అమాయక భక్తులపై నోరుపారేసుకుంటూ, అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులను భయపెట్టేలా, దూషణాత్మకంగా వ్యవహరించడం వల్ల ఆలయ వాతావరణం పూర్తిగా కలుషితమవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, బోర్డు మెంబర్లు కూడా తమ బాధ్యత, అరహత (విలువ) మరిచి, ఈ అనధికార వ్యక్తుల దుర్వ్యవహారాన్ని అడ్డుకోకుండా మౌనంగా ఉండటం వల్ల పరిస్థితి మరింత చేదుగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలనా బాధ్యత వహించాల్సిన వారే స్పందించకపోవడం వల్ల ఆలయ నిర్వహణ వ్యవస్థపై భక్తుల విశ్వాసం దెబ్బతింటోంది.

అదీ కాకుండా, ఆలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీదేవి అనే ఉద్యోగి కూడా అదే విధమైన దుర్వ్యవహారానికి పాల్పడటం ఆశ్చర్యకరంగా, ఆందోళనకరంగా ఉందని భక్తులు చెబుతున్నారు. ఆలయ సిబ్బంది నుంచే ఇలాంటి ప్రవర్తన ఎదురవుతుంటే, భక్తులు ఎవరి వద్ద న్యాయం ఆశించాలనే ప్రశ్న తలెత్తుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో అశ్లీల మాటలు, అవమానకరమైన ప్రవర్తన చోటుచేసుకోవడం వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తి, శాంతి, నియమ నిష్ఠలకు ప్రతీకగా ఉండాల్సిన సమయంలో, ఇలాంటి ఘటనలు ఆలయ గౌరవాన్ని మసకబారుస్తున్నాయని భక్తులు వాపోతున్నారు.బోర్డు మెంబర్లు తమ బాధ్యతను గుర్తించి, ఆలయ గౌరవాన్ని కాపాడేలా తక్షణమే అధికారులు అయిన ఆలయ ఈఓ శేఖర్ మరియం సూపరింటెండెంట్ హైమావతి జోక్యం చేసుకుని, అనధికార వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.