23-12-2025 03:12:33 PM
1033 నెంబరుకు సంబందించి ప్రచారం కల్పించండి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో విస్తరించి ఉన్న జాతీయ రహదారి, ఆర్ అండ్ బి రోడ్లపై ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు అవసరమైన ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఏర్పాట్లు కావాలి అనే విషయాలను పోలీస్, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.
జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగితే ముందుగా 1033 నెంబరు క ఫొన్ చేయాలి అనే విషయాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆలస్యం కాకుండా ప్రాణాలు కాపాడటానికి అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను దగ్గరలోని ఏ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకొని ఉండాలని సూచించారు. అది ప్రైవేట్ అయిన ప్రభుత్వ ఆసుపత్రి అయిన పర్వాలేదు అన్నారు.
జాతీయ రహదారిపై గుర్తించిన బ్లాక్ స్పాట్ లు వెల్టూరు, పాలెం, మదర్ థెరిసా కూడలి, అమడబాకుల, రంగాపూర్, ఆనందభవన్ వంటి చోట్ల ప్రమాద నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా ప్రమాదాలు జరగటానికి కారణాలు ఏంటి అనే విషయాలు అన్వేషించాలన్నారు. జనవరి నెలలో జరిగే రోడ్డు భద్రత వారోత్సవాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలు జరుగకుండా ఉండటానికి సూచిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, వేగం కొలిచే యంత్రాలు వంటివి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వనపర్తి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు
పట్టణంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ పనిచేసే విధంగా మరమ్మతులు చేయించడంతో పాటు బస్టాండ్ కూడలి, అంబేద్కర్ కూడలి లో సైతం కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనవరి ఒకటి నుండి ద్విచక్ర వాహనం నడిపేవారు ఖచ్చితంగా హెల్మెంట్ ధరించాలని లేదంటే జరిమానాలు విధించాలని సుచించారు. ట్రిబుల్ రైడింగ్, లైసెన్స్ లేకుండా నడపటం వంటి వాటి పై కటినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మదనపూర్ బ్రిడ్జి పనులు ఎట్టిపరిస్థితుల్లోనూ వర్షాకాలం లోపు పూర్తి చేయాలని రోడ్లు భవనాల ఇంజనీరును ఆదేశించారు.
వనపర్తి రోడ్డు వద్ద అండర్ వే బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ బాలాజీ , అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఆర్ అండ్ బి కార్యనిర్వహక ఇంజనీరు దేశ్య నాయక్, ఆర్టీవో మానస, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సాయినాథ్ రెడ్డి, డిప్యూటీ ఈ. ఈ ఆర్ అండ్ బి సీతారామ స్వామి, డి.యం. ఆర్టీసీ, జాతీయ రహదారి ఇంజనీర్లు, కాంట్రాక్టరు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు .