calender_icon.png 18 July, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యాలను వంద శాతం సాధించాలి: కలెక్టర్ కుమార్ దీపక్

17-07-2025 08:09:52 PM

భీమారం,(విజయక్రాంతి): భావి తరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం - 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తిగా సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం భీమారం మండల కేంద్రంతో పాటు అర్కెపెల్లి గ్రామంలోని మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ లతో కలిసి రెండు వేల మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని, జిల్లాకు కేటాయించిన వన మహోత్సవ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణలలో, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలని సూచించారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని, నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నారు.

విద్యార్థుల హాజరు శాతం పెంపొందించడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల కేంద్రంలో నిర్మితమవుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ మండల అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజనం నాణ్యతను పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం మెనూ, విద్యాబోధన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల, వసతిగృహాలను కలెక్టర్ సందర్శించి భోజనశాల, 8వ తరగతి గదులను సందర్శించి మరమ్మత్తులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఆహారం తయారీ సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులు వినియోగించాలని, వంట చేసే వారు శుభ్రత నిబంధనలు పాటించాలని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని కోరారు.