23-11-2025 09:41:19 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): భద్రకాళి ఆలయ మాఢ వీధుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో భద్రకాళి మాఢ వీధుల నిర్మాణ పనులు, వాటి పురోగతి, సుందరీకరణ పనులతో పాటు రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ వే ఏర్పాటుపై కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భద్రకాళి ఆలయం మాఢ వీధుల నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలు, సుందరీకరణ పనులు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, ఏర్పాటు చేయనున్న రోప్ వే, గ్లాస్ బ్రిడ్జి వే అంశాలను సమావేశంలో చర్చించారు. నిర్మాణ, సుందరీకరణ పనులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భద్రకాళి ఆలయ మాఢ వీధుల విస్తరణ పనులకు ఉన్న అడ్డంకులను తొలగించి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.