01-05-2025 01:26:04 AM
ఓయూ రిజిస్ట్రార్ నరేష్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30(విజయక్రాంతి) : రాష్ట్ర వ్యాప్తంగా 12 యూని వర్సిటీల్లో 12రోజులుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న నిరవదిక సమ్మెను బుధవారం విరమించారు. ఈ సందర్భంగా ఆయా యూనివర్సిటీల్లో రిజిస్ట్రార్‌లు, అధికారులు కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె శిభిరం వద్దకు వెళ్లి మాట్లాడారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో పరిపాలన భవనం ఎదుట సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల వద్దకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.జి.నరేష్‌రెడ్డి వెళ్లి మాట్లాడారు.
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ప్రభుత్వం తరఫున ఓయూ నుంచి తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ సమ్మెను విరమిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్(టీజీయూసీటీఏ) జేఏసీ ఓయూ నేతలు డా.ధర్మతేజ, డా.పరశురాం, డా.వేల్పుల కుమార్, డా.విజేందర్ రెడ్డి, తదితరులు తెలిపారు.
తమకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు, ప్రతినిధులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపా రు. కాకతీయ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల వద్దకు ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.వల్లూరి రామచంద్రం వెళ్లి దీక్షను విరమింపజేశారు.
ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన నేపథ్యంలో, సీఎం రేవంత్‌రెడ్డిపై విశ్వాసంతో సమ్మెను విరమిస్తున్నట్లు టీజీయూసీటీఏ కేయూ నేతలు డా.సాదు రాజేష్, డా.శ్రీధర్‌కుమార్ లోథ్, డా.మా దాసి కనకయ్య, డా.కరుణాకర్‌రావు, డా.ఆశీర్వాదం తదితరులు తెలిపారు.
వివిధ యూనివర్సిటీల్లోనూ సమ్మెను విరమించారు. కార్యక్రమాల్లో డా.ఉపేందర్, డా. పరమేష్, డా.శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, డా. ఫిరోజ్‌పాష, డా.జూల సత్య, డా.శ్రీదేవి, డా.భాగ్యలక్ష్మి, డా.సునీత, డా.కృష్ణవేణి, డా.కవిత తదితరులు పాల్గొన్నారు.