29-10-2025 12:00:00 AM
-చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్
-ఇందిరమ్మ బిల్లు మంజూరైనా డబ్బులు ఇవ్వలేదని జులుం
-అదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో ఘటన
ఆదిలాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారునిపై మంగళవారం ఓ కాంట్రాక్టర్ దౌర్జన్యం చేశాడు. బిల్లు మంజూరైనప్పటికీ డబ్బులు ఇవ్వడం లేదంటూ అతన్ని చెట్టుకు కట్టేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కోట (కే )గ్రామానికి చెందిన మారుతికి తన భార్య పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
అయితే ఇంటి నిర్మాణ బిల్లులు వచ్చిన వెనువెంటనే చెల్లిస్తానంటూ కాంట్రాక్టర్ సత్యనారాయణతో సదరు లబ్ధిదారుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవల లక్ష రూపాయలు బిల్లు మంజూరైనప్పటికీ లబ్ధిదారుడు తనకు డబ్బులు ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తుండడంతో కాంట్రాక్టర్ ఆగ్రహించాడు. మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలో ఓ చెట్టుకు లబ్ధిదారున్ని కట్టేసి డబ్బులను ఇవ్వాలంటూ కాంట్రాక్టర్ ఒత్తిడి చేశారు. ఈ ఘటనపై ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.