calender_icon.png 29 October, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజేఐ గవాయ్ దాడి ఘటనపై కేసు ఎందుకు నమోదు చేయలేదు

29-10-2025 12:00:00 AM

  1. పోలీసు, న్యాయ వ్యవస్థలకు ఈ దాడి కనిపించడం లేదా..?
  2.   1న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ
  3. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడి 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద దాడి జరిగితే ఇప్పటీ వరకు కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. ఎన్నో కేసులను సుమోటోగా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు ఈ దాడి కనిపించడం లేదా..? అని ఆయన నిలదీశారు.

అనేక విషయాల మీద స్పందించే మానవ హక్కుల కమిషన్ కూడా మౌనంగా ఎందుకున్నదని, కోర్టులో దాడి జరిగినా కంటెంట్ ఆఫ్ కోర్టు, కోర్టు ధిక్కరణ కింద శిక్షలు ఎందుకు పడవని అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నేరేడ్‌మ్మెట్‌లో మంగళవారం మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుంది.

ఈ దాడి జరిగి 20 రోజుల గడుస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణం. జస్టిస్ గవాయ్ స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జి ఉంటే ఇంత నిర్లక్ష్యం చేసి ఉండే వారా..?  తను దళితుడు కాబట్టే స్పందించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు కూడా మౌనంగా ఉన్నాయి’ అని కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. హరియాణాలో ఒక లాయర్‌కు, జడ్జికి వాగ్వివాదం జరిగితే..

జడ్జిని అమర్యాదగా మాట్లాడినందుకే అతనిపై సుమోటో కేసు పెట్టి చర్యలు తీసుకున్నారని ఆయన గర్తు చేశారు. ప్రధాని నుంచి మొదలుకుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ అగ్రనేతలు, దేశవ్యాప్తంగా దాడి ఘటనను ఖండించినా.. అరెస్టులు, చట్టపరమైన కేసులు లేవని అన్నారు. దాడిని ఖండించిన వాళ్లు అరెస్టు చేయాలని, కేసులు పెట్టాలని డిమాండ్ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అని నిలదీశారు.

ఈ ద్వంద్వ విధానాలతో దళితుల అస్తిత్వం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఆత్మగౌరవం కంటే ఏది ముఖ్యం కాదని అన్నారు. విశ్వాసాలు, ధర్మాల పేరుతో దాడులకు దిగితే చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. అందుకే జస్టిస్ బీఆర్ గవాయ్ మీద జరిగిన దాడి దళితులపైన, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ స్ఫూర్తి మీద జరిగిన దాడిగా చూస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు.

గవాయిపై దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామని, నవంబర్ 1న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి సచివాలయం ఉన్న పెద్ద అంబేడ్కర్ విగ్రహం వరకు దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన మహా ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు.

ఈ ర్యాలీకి రాష్ర్ట వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం కోసం కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని ఆయన  పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఎస్‌పీ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, కేశపాగా రాంచందర్ మాదిగ మేడ్చల్  జిల్లా అధ్యక్షులు పంగ ప్రణయ్ మాదిగ, బచ్చలికూర స్వామి మాదిగ, పోలేపాక అంజయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.