11-07-2025 01:00:39 AM
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య విభేదాలతో రసాభాస
- అసంతృప్తితో వెనుదిరిగిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాలలో బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 201 దేవాలయాలకు విడుదల చేసిన రూ.కోటి 7లక్షల 60వేల 500 లు చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం భోలక్‌ప్పూర్లోని భవాని శంకర దేవాలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్ పంపిణీ వేధిక వద్దకు చేరుకున్నారు.
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రాకపోవడంతో రెండు గంటలు వేధిక వద్ద కూర్చున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవాదాయ శాఖ అధికారులను నిలదీశారు. కొన్ని చెక్కులు ఇచ్చి వెళ్తాను మీరు కార్యక్రమాన్ని కొనసాగించుకోండి అని ఎమ్మెల్యే అధికారులకు సూచించినా అధికారులు వినకపోవడంతో ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు దేవాదాయ శాఖ చెక్కుల పంపిణీ ఇన్చార్జి సత్యనారాయణతో వాగ్వాదానికి దిగారు.
ఇది కాంగ్రెస్పార్టీ కార్యక్రమా, చెక్కుల పంపిణీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. దీనితో వేధిక వద్ద ఇరుగురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఎమ్మెల్యే వేధిక వద్ద నుంచి వెళ్లిపోతుండగా బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన వెంట వెళ్లిపోయారు.