01-12-2024 02:11:32 AM
జనాగామ మునిసిపల్‌లో కౌన్సిలర్ల నిరసన
జనగామ, నవంబర్ 30 (విజయక్రాంతి): జనగామ పట్టణంలో శిథిలా వస్థలో ఉన్న రెండు మడిగడలను కూల్చివేయాలని ఇటీవల మున్సిపల్ చైర్‌పర్సన్ ఆదేశించిన విషయంపై కౌన్సిల్ మీటింగ్‌లో రగడ నెలకొంది. మడిగడల నంబర్‌లు లేకుండానే కూల్చివేత అంశాన్ని ఎజెండాలో పొందుపరచగా.. కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. శనివారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శిథిలావస్థకు చేరిన రెండు మడిగడల కూల్చివేత అంశం రచ్చకు దారితీసింది. నెలనెలా మంచి అద్దె వస్తున్న రెండు మడిగడిలను కూల్చడం సరికాదని కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమునతో వాదనకు దిగారు. పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం ఎదురుగా సంతోషిమాత ఆలయా నికి ఆనుకుని ఉన్న మడిగడిలనే కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఒక గేటు ఉన్నప్పటికీ మరో గేటు ఏర్పాటు చేయాలనే సాకుతో అనాలోచిత నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. మరోవైపు పలు వార్డుల కౌన్సి లర్లు తమ వీధుల్లో నెలకొన్న సమస్యలపై లేవనెత్తారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ చంద్రమౌళి, మేనేజర్ రాములు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ గోపయ్య, మధు పాల్గొన్నారు.