పోలీసులకు ఫిర్యాదు చేసిన స్టూడెంట్స్ తల్లిదండ్రులు
శేరిలింగంపల్లి, నవంబర్ 30 : పిల్లలను సన్మార్గంలో నడిపించా ల్సిన బాధ్యతను మరిచిన ఓ కీచక టీచర్ ఇంటర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మియాపూర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. మియాపూర్‌లోని మదీనగూడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో హరీశ్ అనే లెక్చరర్ ఇంటర్ స్టూడెంట్స్‌కు ఫోన్‌లో అసభ్యకర మెజేజ్‌లు పంపుతున్నాడు.
కాలేజీలో ఒంటరిగా కనిపించిన అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటాడని పలువురు విద్యార్థినులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు చెబితే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించాడని వారు వాపోయారు. విషయం బయటకు పొక్కకుండా కాలేజీ డీన్ నాగరాజు, ప్రిన్సిపల్ ప్రభు తమను బెదిరించారని విద్యార్థులు వాపోయారు. కాగా కొన్ని నెలలుగా అతడి వేధింపులను తట్టుకుంటున్న ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.
ఆమె కుటుంబ సభ్యులు శనివారం కాలేజీకి వచ్చి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు ఉపాధ్యాయుడిని తమ ముందు హాజరు పరచాలని డిమాండ్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై వేధింపులకు పాల్పడిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.