calender_icon.png 5 January, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేగా బచావో సంగ్రామ్‌కు సమన్వయ కమిటీ

05-01-2026 02:19:49 AM

తెలంగాణ నుంచి మంత్రి సీతక్కకు చోటు 

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఎంజీ నరేగా -బచావో సంగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత స్థాయిలో విస్తృత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం ఏఐసీసీ ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామీణ పేదలు, కూలీల హక్కుల పరిరక్షణకు జరుగుతున్న ఈ జాతీయ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి డా. దనసరి అనసూయ(సీతక్క)కు కీలక బాధ్యతలు అప్పగించారు.

అజయ్ మాకెన్ కన్వీర్‌గా ఉన్న ఈ కమిటీలో జైరాం రమేష్, సందీప్ దీక్షిత్, డాక్టర్ ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే, మంత్రి సీతక్క, దీపికా పాండే సింగ్, డాక్టర్ సునీల్ పంవార్, మానిష్ శర్మ సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఏఐసీసీ ఓబీసీ, ఎస్సీ, మైనార్టీ, ఆదివాసి కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్లు, కూడా ఈ సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఎంజీ నరేగా పథకాన్ని బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, గ్రామీణ భారతంలోని కోట్లాది కూలీల ఉపాధి హక్కులను కాపాడే లక్ష్యంతో ఈ బచావో సంగ్రామ్ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా సాగనుందని ఏఐసీసీ స్పష్టం చేసింది.