భూసేకరణ ప్రక్రియలో రైతులతో సమన్వయం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ అంకిత్
లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 21, (విజయక్రాంతి): రైతులతో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ వారం రోజుల్లో భూ సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారుల ఆదర్శించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, భూ సర్వే పనులను శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రపురం, కారుకొండ రెవెన్యూ గ్రామాల పరిధిలో జరుగుతున్న భూ సర్వే ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వే జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, భూముల వివరాలు, సర్వే పురోగతి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి సంబంధించిన అలైన్మెంట్ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. హేమచంద్రపురం, కారుకొండ గ్రామాల పరిధిలో సుమారు 191.25 ఎకరాల భూమిని సర్వే చేయాల్సి ఉండగా, సుమారు 7.50 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు.
ఇప్పటివరకు సుమారు 6 ఎకరాల మేర భూ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ప్రతిపాదిత అలైన్మెంట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సర్వే సమయంలో భూముల హద్దులు, విస్తీర్ణం, ఇతర సంబంధిత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు.
భూ సర్వేకు సంబంధించి రైతులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీటి వసతుల విస్తరణకు సంబంధించిన పనుల్లో భూసేకరణ, భూ సర్వే కీలకమైన అంశాలని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డీవో మధు, లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, సర్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






