25 March, 2026 | 2:49 AM

సేఫ్టీకి చర్యలు చేపట్టిన కౌన్సిలర్లు

25-03-2026 01:16 AM

వార్డులో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు 

కేసముద్రం, మార్చి 24 (విజయక్రాంతి): నూతనంగా మహబూబాబాద్ జిల్లాలో ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు తమ వార్డుల్లో ప్రజల రక్షణ కోసం సేఫ్టీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 8,9 వార్డుల కౌన్సిలర్లు కనుకుల సుభద్ర, వేముల భారతి తమ వార్డుల్లోని ప్రజలతో అవగాహన సదస్సులు నిర్వహించి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు, మత్తు, గంజాయి తదితర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు సంఘటితం చేశారు.

అలాగే వార్డుల్లో ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో 12వ వార్డు కౌన్సిలర్ తరాల వీరేష్ యాదవ్ తన వార్డులో నిరంతరం నిఘా ఉండేందుకు ఒక లక్ష 80 వేల రూపాయలతో 17 అత్యాధునిక వీవోసీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.

ఈసీసీ కెమెరాలు 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ప్రతి అంశాన్ని రికార్డు చేస్తాయి. అలాగే ఆడియో, వీడియో చిత్రీకరణ స్పష్టంగా ఉంటుంది. విద్యుత్ సరఫరా, కేబుల్ తో పని లేకుండా సోలార్ సిస్టం ద్వారా చార్జింగ్ అవుతూ ఎలాంటి అంతరాయం లేకుండా సీసీ కెమెరాలు పనిచేస్తాయి. అలాగే ప్రత్యేక క్లోజ్ స్టోరేజ్ సిస్టం ఏర్పాటు వల్ల వారం రోజులపాటు సీసీ కెమెరాల్లో నమోదైన ఆడియో వీడియో నిక్షిప్తమై ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా దొంగలు సీసీ కెమెరాలు అపహరించిన ఆధునిక టెక్నాలజీ వల్ల అవి ఎక్కడ ఉన్నాయని కూడా పసిగట్టవచ్చు. ఒక్కో కెమెరా పదివేలకు పైగా ఖర్చుపెట్టి తన వార్డులో వీరేష్ ప్రజల రక్షణ కోసం గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయించాడు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిలుపుమేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజల రక్షణ కోసం ముందుకు వస్తున్నారు. కేసముద్రం కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడడం, వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిలో అత్యధికులు యువత కావడంతో వినూత్నమైన కార్యక్రమాల నిర్వహణకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

నిఘా నీడలో 12వ వార్డు

వార్డు ప్రజల రక్షణ కోసం ఆధునిక టెక్నాలజీ తో రూపొందించిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల 12 వ వార్డు పూర్తిగా నిఘా నీడలో ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సీసీ కెమెరాలు దోహదపడతాయి. పోలీసుల పిలుపుమేరకు వార్డు ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించా. భవిష్యత్తులో వార్డు ప్రజల సంక్షేమం కోసం ఇతర కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.

తరాల వీరేష్ యాదవ్, కౌన్సిలర్