25 March, 2026 | 2:48 AM

చెప్పేదొకటి చేసేదొకటి

25-03-2026 01:17 AM

బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులొకలా.. ఖర్చులు మరోలా..

  1. మొదటి రెండు బడ్జెట్‌లో రూ.21,113 కోట్లలో ఖర్చు చేసింది రూ.5 వేల 5 కోట్లే 
  2. బీసీ సబ్‌ప్లాన్ ఎటుపాయె?
  3. శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): బీసీలకు బడ్జెట్ కేటా యింపులు ఒకలా ఉంటే, ఖర్చు మరొకలా ఉంటోందని శాసన మండలిలో ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తంచేశారు. బీసీలకు బడ్జెట్ కేటాయింపులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పోడియం దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం విషయంలో చెప్పేదొకటి.. చేసేదొకటని, బీసీలకు ఎన్ని కల్లో ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో విఫలమైందని వారు విమర్శించారు.

బీసీ సబ్‌ప్లాన్‌ను అమలుచేస్తామని రెండున్నరేళ్లవుతున్నా అమలుకు నోచుకోవడంలేదని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండేళ్ల లో 2,02,298 మంది బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికలో స్పష్టంగా ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. 2,44,766 మందికి స్కాలర్‌షిప్ ఇచ్చామని చెప్పారని, అయితే తాజా బడ్జెట్‌లో మాత్రం కేవలం 42,468 మందికి మాత్రమే ఇచ్చారని అన్నారు.

మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయం లో బీఆర్‌ఎస్ సభ్యుడు మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు, ఖర్చులకు పొంతనలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏటా బీసీ సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి దాన్ని అమలు చేయడంలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి రెండు బడ్జెట్‌లో రూ.21,113 కోట్లు కేటాయించగా, అందులో విడుదల చేసింది మాత్రం రూ.13,425 కోట్లేనని, అందులోనూ ఖర్చు చేసింది కేవలం రూ. 5,005 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. గత 2025-26 బడ్జెట్‌లో రూ.11,607 కోటలు కేటాయించగా, రూ.7,214 విడుదల చేసి, అందులో దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా నిధులను మాత్రమే బీసీల కోసం ఖర్చు చేశారని తెలిపారు.

బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చి ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ మూడు బడ్జెట్‌లలో కలిపి మొత్తం రూ.60 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. 51 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీసీలకు బడ్జెట్‌లోని కేటాయింపులను సవరించుకొని ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. 

బీసీ సబ్‌ప్లాన్ ఎక్కడ?: ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ 

బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తారా? లేదా? చెప్పాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. ఈ బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లకుపైగా నిధులను కేటాయిస్తే అందులో సింహభాగం నిర్వహణకే పోతే బీసీల సంక్షేమానికి ఏముంటాయన్నారు. సమాజంలో అంతరాలు పెరగొద్దంటే అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగాల్సి ఉందన్నారు. బీసీలకు కేటాయించిన నిధుకల మొత్తాన్ని ఖర్చు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఏర్పడిన మొదటి అసెంబ్లీ సెషన్‌లోనే బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని, మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఇంకా ఏర్పాటు చేయలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్  కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. జస్టిస్ సుద్శన్‌రెడ్డి కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన కులగణన సర్వే నివేధికను సభ్యులకు ఇవ్వాలని కోరారు. బీసీల ఓట్లు దండుకుని బీసీలను మోసం చేస్తుందని బీఆర్‌ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కాలర్‌షిప్‌లు ఎగ్గొట్టారు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

బీసీ విద్యార్థుల స్కాలర్షిప్‌ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు బడ్జెట్‌లలో రూ.2,475 కోట్లు విడుదల చేస్తే అందులో రూ.489 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలేదన్నారు. బీసీలకు బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు చేసే విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.8 వేల కోట్లకు పైగా నిధులను కోత పెట్టిందన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని ఆయన కోరారు. కళ్యాణ లక్ష్మి పథకంలోను బీసీలకు అన్యాయం జరుగుతోందని, రెండు బడ్జెట్‌లోనూ రూ. 4,348 కోట్లు విడుదల చేస్తే అందులో రూ.364 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. కేంద్ర ఉద్యోగాల్లోనూ బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని, తెలంగాణలో వంద మంది అత్యంత ధనవంతుల్లో ఒక్కరే బీసీ ఉన్నారని, ఎస్సీ, ఎస్టీలు అసలులేరని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇది ఆర్థిక సమానత్వం ఎలా అవుతుందని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. దేశంలోని 23 ఐఐటీల్లోనూ 79 శాతం మంది ప్రొఫెసర్లు ఓసీలు ఉన్నారని, 3,137 మంది బీసీ ప్రొఫెసర్లకు ఉన్నది కేవలం 676 మాత్రమేనని తెలిపారు. 32 లక్షల మంది నిరుద్యోగులు టీజీపీఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందన్నారు.

కృష్ణా జలాల్లో 560 టీఎంసీల వాటా అయితే తెలంగాణకు దక్కింది 299 టీఎంసీలు అని, గోదావరిలో పూర్తి వాటా దక్కలేదన్నారు. తెలంగాణను ఫీనిక్స్ పక్షితో పోల్చడం సరికాదని, ఇది ఉద్యమాల ఫలితంగా ఏర్పడిందన్నారు. ఇవన్నీ వివరిస్తున్న క్రమంలో మండలి చైర్మన్ మల్లన్న మైక్ కట్ చేయడంతో బీసీల అంశంపై పూర్తి చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఆయన తన స్థానంలోనే కాసేపు నిలబడ్డారు.