10-08-2025 12:03:58 AM
- ఇద్దరు సైనికులు మృతి
- కొనసాగుతున్న ‘ఆపరేషన్ అఖాల్’
కుల్గాం, ఆగస్టు 9: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ‘ఆపరేషన్ అఖాల్’ తొమ్మిదో రోజు కూడా కొనసాగింది. కుల్గాంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు రహస్య స్థావరాలను ఏర్పరుచుకొని ఉంటున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
దీంతో శనివారం తెల్లవారుజామున కుల్గాం లో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు లాన్స్ నాయక్ ప్రీత్‌పాల్ సింగ్, సిపాయి హర్మిందర్‌సింగ్‌లు వీరమరణం పొందగా.. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
మృతుల కుటుంబాలకు చినార్ కార్ప్స్ సానుభూతి వ్యక్తం చేసింది. కాగా ఆపరేషన్ అఖాల్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆగస్టు 1న అఖాల్ గ్రామ పరిసరాల్లో ‘ఆపరేషన్ అఖాల్’ పేరుతో భద్రతాధికారులు ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తుపాకీ శబ్దాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
దీంతో గ్రామంలోని మహిళలు, చిన్నారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాల్పు ల శబ్దంతో రాత్రుళ్లు నిద్ర కూడా పోలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేయడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇంత సుదీర్ఘ సమయం కొనసాగుతున్న ఆపరేషన్ ఇదేనని అధికారులు పేర్కొన్నారు.