26-10-2025 12:11:56 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : ప్రముఖ నటుడు చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు రక్షణ కల్పించింది. ఆయన అనుమతి లేకుండా పేరు, ఫొటో, వాయిస్, చిత్రాలను ఎలాంటి వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవద్దని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్పీలు, ఆర్థిక లాభాల కోసం తన పేరు, ఇమేజ్‌ను దుర్వినియోగం చేస్తున్నారంటూ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
కోర్టు తన ఉత్తర్వుల్లో, ఏ వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి వ్యక్తిగత, ప్రచార హక్కులను ఉల్లంఘించరాదని స్పష్టం చేసింది. ఆయన ప్రమేయం లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్‌తో పాటు, అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే మెగాస్టార్, చిరు, అన్నయ్య వంటి పేర్లను కూడా వాణిజ్య అవసరాలకు వాడుకోవడంపై ఆంక్షలు విధించింది.
ముఖ్యంగా, కృత్రిమ మేధ ఏఐ టెక్నాలజీతో ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి డిజిటల్ వేదికలపై దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో భాగంగా, చిరంజీవి పేరు, ఫొటోలను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 మంది వ్యక్తులు/సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.
సీపీ సజ్జనార్‌తో చిరంజీవి భేటీ..
ఈనెల 11వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కలిసి, కోర్టు ఉత్తర్వుల ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా, ఇలాంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు ప్రస్తుత శిక్షా చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు అభిప్రాయప డిన ట్లు సమాచారం.
కృత్రిమ మేధ ఏఐ వ్యాప్తి తో తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్న సినీ ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. గతంలో నటు డు నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు అను కూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అదే బాటలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్, కరణ్ జోహార్ వంటి అనేక మంది తారలు తమ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే.