26-10-2025 12:52:38 AM
ఆసిన్ తొట్టుంకల్.. తెలుగు, తమిళ, హిందీ భాషా ప్రేక్షకుల మనసు దోచు కున్న హీరోయిన్. 1985, అక్టోబర్ 26న పుట్టిన ఈమె స్వస్థలం కేరళలోని కొచ్చిన్. నటిగా, మో డల్‌గా, నృత్యకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న ఆసిన్ తొలుత దక్షిణాది చిత్రపరిశ్రమలో యాక్టింగ్ కెరీన్‌ను ప్రారంభించింది. బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో శివమణి, అన్నవరం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, చక్రం, ఘర్షణ, లక్ష్మీనరసింహ, దశావతారం, ‘గజిని’ వంటి సినిమాలు ఆమె ఫిల్మోగ్రఫీలో చెప్పుకోదగ్గవి.
సుజీత్.. టాలీవుడ్ డైరెక్టర్. 1990, అక్టోబర్ 26 ఆయన పుట్టిన తేది. స్వస్థలం అనంతపురం. ఈ యువ దర్శకుడు చేసింది మూడు సినిమాలే అయినా జెన్‌జెడ్ కిడ్స్‌కు అభిమాన దర్శకుడిగా మారిపోయారు. ఇందుకు కారణం.. ఇటీవల పవన్‌కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రానికి దర్శకత్వం వహించటమే! అంతకుముందు సుజీత్ 2014లో ‘రన్ రాజా రన్’తో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. 2019లో హీరో ప్రభాస్‌తో తెరకెక్కించిన ‘సాహో’తో ఇటు సౌత్, అటు నార్త్‌లోనూ పేరు తెచ్చుకున్నాడు.
ప్రముఖ గాయకుడు మనో పుట్టిన రోజు ఆదివారమే. 1965, అక్టోబర్ 26న ఏపీలోని సత్తెనపల్లిలో జన్మించి ఆయన నేటితో 60వ పడిలోకి అడుగుపెడుతున్నారు. మనో అసలు పేరు నాగూర్ సాహెబ్. ఆయన మనో అనే పేరుతో రంగస్థలానికి పరిచయమయ్యారు. గాయకుడిగానే కాకుండా స్వరకర్తగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా చిత్రసీమలో రాణించారు.
తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ, మలయాళ, హిందీ, తుళు, కొంకణి, అస్సామీ భాషల్లోని కళా ప్రియు లకు మనో వాయిస్ సుపరిచితం. ముత్తు (1995) సినిమా నుంచి తెలుగులో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు డబ్బింగ్ ఆయనే చెప్పటం విశేషం. ఇప్పటికీ పలు టీవీ కార్యక్రమాల్లో అతిథిగా, న్యాయనిర్ణేతగా పాల్గొంటూ అలరిస్తున్నారు.