22-10-2025 07:44:33 PM
తహసిల్దార్ కి వినతిపత్రం అందజేస్తున్న సిపిఐ నాయకులు..
గరిడేపల్లి (విజయక్రాంతి): అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయని తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో పడుతున్న ఈ అకాల వర్షాల కారణంగా వరి పొలాల మొత్తం పడిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని ఇప్పటికే అనేక గ్రామాల్లో అకాల వర్షాలతో వంటలు నెలకొరిగాయని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 చొప్పున ఆర్థికసాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరుగాలం రైతులు కష్టపడి చెమటోడ్చి పంటలు వేయగా అకాల వర్షాలతో నష్టపోతున్నారని తెలిపారు. పెట్టుబడులకు డబ్బులు లేక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టి పంటలు వేయగా మరో 20 రోజుల్లో పంట చేతికి వచ్చే తరుణంలో అనుకోకుండా కురుస్తున్న వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయని తెలిపారు. అకాల వర్షానికి తోడు గాలి విపరీతంగా వస్తుండడంతో పంట మొత్తం నేలపై పడుతుందని దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రావని బాధలో రైతులు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన పంటల వివరాలను సేకరించి నష్టపోయిన రైతులను కోవాలని ఆయన కోరారు. అనంతరం తహసిల్దార్ బండ కవితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, రైతు సంఘం నాయకులు నరసింహారావు, కృష్ణ,ఎడ్ల అంజన్ రెడ్డి, ప్రధాని సైదులు తదితరులు పాల్గొన్నారు.