22-10-2025 10:01:58 PM
రామాయంపేట (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామాయంపేటలోని వివేకానంద విద్యాలయ విద్యార్థులకు పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యాలయానికి చెందిన 62 మంది విద్యార్థులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీస్ శాఖ విధుల్ని సమీపంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లోని పట్టుబడ్డ వాహనాలు, పెట్రోలింగ్ వాహనాల వినియోగం, ఎస్‌హెచ్‌ఓ కార్యాలయం, రిసెప్షన్ హాల్, నిర్బంధ గదులు, సీసీ కెమెరా వాచ్ రూమ్‌లను ప్రాధాన్యతగా చూసారు.
స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటరాజా గౌడ్, సబ్ ఇన్‌స్పెక్టర్ బాలరాజు విద్యార్థులకు పోలీస్ శాఖ నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలను నివారించే చర్యలు తదితర అంశాలు వివరించారు. పోలీసులు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి ప్రతిరూపమై సేవ చేస్తున్నారని, ఈ విలువలు ప్రతి విద్యార్థి ఆచరించాలని సూచించారు. విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని “పోలీసు స్ఫూర్తి మన సమాజానికి మార్గదర్శకం” అని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో దేశసేవ, సామాజిక బాధ్యత విలువలను పెంపొందించడంలో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.