08-08-2025 06:32:03 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం..
చండూరు (విజయక్రాంతి): ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం(CPM District Secretary Group Member Banda Srisailam) అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం ఆ పార్టీ సీనియర్ నాయకులు మోగదాల వెంకటేశం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా భావద్వేగాలను రెచ్చగొడుతూ విధ్వంస పాలన కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 మాసాలు గడిచిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంతో గ్రామాలలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని వెంటనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామాల్లో స్థానిక సమస్యల పరిష్కారం అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన అన్నారు. గత ఏడాది కాలంగా అధికారుల ఇన్చార్జి పాలనలో జవాబుదారితనం లోపించిందని, దాని ద్వారా గ్రామీణ అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. ఒకప్పుడు పల్లె వెలుగు బస్సులు మారుమూల గ్రామాల్లో బస్సులు వచ్చేవని, ఇప్పుడు మాత్రం పల్లె వెలుగు బస్సులు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మారు మూలగ్రామాలకు పల్లె వెలుగు బస్సులు పునరుద్ధరించాలని ఆయన అన్నారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేసి వాటిపై పోరాటాలు నిర్వహించాలని, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రజా పోరాటాలు నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 12,13 కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభలను మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. క్యూబా సంఘీభావ నిధిని కార్మిక వర్గం నుండి వసూలు చేసి జిల్లా కేంద్రానికి పంపాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం సీనియర్ నాయకులు మోగుదాల వెంకటేశం, చిట్టి మల్ల లింగయ్య, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.