15-08-2025 12:00:00 AM
అక్రమ బెట్టింగ్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కొరడా ఝులిపిస్తుంది. కేసు దర్యాప్తులో ఈడీ తన దూకుడు పెంచింది. మంగళవారం ఒక్కరోజే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, మధురై, సూరత్‌లోని దాదాపు 15 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ‘పారిమ్యాచ్’ బెట్టింగ్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది వినియోగదారుల నుంచి 2వేల కోట్లకు పైగా వసూలు చేసి మోసాలకు పాల్పడి నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ మొత్తాన్ని అగ్రిగేటర్లు, ఏజెంట్ల ద్వారా తమిళనాడులోని ఒక ప్రాంతంలో ఏటీఎమ్‌లతో పాటు యూపీఐ యాప్ ల ద్వారా భారీ ఎత్తున నగదు ఉపసంహరణ జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ‘పారిమ్యాచ్’ అనేది సైప్రస్‌కు చెందిన గేమింగ్ బెట్టింగ్ అప్లికేషన్. ఈ యాప్ ద్వారా 2021లో భారత్‌లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరిగాయి. ఇటీవలే అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు గానూ వరుసగా సినీ, క్రీడా ప్రముఖులపై కేసులు నమోదు చేసిన ఈడీ విచారణకు పిలిచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది.
తాజాగా బుధవారం భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ఈడీ విచారించింది. వన్‌ఎక్స్ బెట్ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు రైనా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నట్టు ఆరోపణలు ఉండటంతో ఈడీ అతడిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అక్రమ బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో చెప్పాలని, బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో మీ పాత్ర ఏంటి? ఏదైనా ప్లాట్‌ఫామ్‌లతో ఒప్పందం చేసుకున్నారా అంటూ ప్రశ్నలు సంధించింది.
బెట్టింగ్ యాప్ కేసులోనే ఇటీవలే తెలుగు సినీహీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. తాను ఎప్పుడూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలే దని, ఏ23 అనే లీగల్ గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని తెలిపారు. గేమింగ్ యాప్స్‌కు, బెట్టింగ్ యాప్స్‌కు చాలా తేడా ఉందని పేర్కొ న్నారు. గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపైనే ఈడీ తనను విచారణకు పిలిచిందని మీడియా హెడ్డింగ్‌లు మార్చాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
నిజానికి బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కు చాలా తేడా ఉంది. గేమింగ్ యాప్స్‌కు భారత్‌లో ప్రభుత్వం నుంచి లీగల్ అనుమతి ఉంది. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ మాత్రం నిషేధం.ఇదే బెట్టింగ్ యాప్స్ పేరిట కొందరు లోన్ యాప్స్ నిర్వాహకులు వినియోగదారులను సంప్రదించి తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తామని ఆశ చూపి బెట్టింగ్ వ్యాపారం చేస్తున్నారు. అవసరానికి లోన్ యాప్‌ల నుంచి డబ్బులు తీసుకుంటున్న వినియోగదారులు అవి సకాలంలో చెల్లించడంలో మాత్రం విఫలమవుతున్నారు.
దీంతో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నవారు కోకొల్లలు. అయితే బెట్టింగ్ యాప్స్‌ను ఆదాయ మార్గంగా ఎందుకు ఎంచుకుంటున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో చాలామంది బెట్టింగ్ యాప్‌లను అభివృద్ధి చేసి వాటిని ప్రమోట్ చేసేందుకు సెలబ్రిటీలను ఉపయోగించుకుంటున్నారు. సెలబ్రిటీలు కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూప్స్‌లో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు.
అయితే ఒక వ్యక్తి చేసిన డిపాజిట్‌పై పర్సంటేజీలను ప్రమోట్ చేసిన వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధానం వల్ల రోజుకు లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. అయితే బెట్టింగ్ యాప్‌లు సాంకేతికంగా చాలా పకడ్భందీ వ్యవస్థను రూపొందించుకున్నాయి.
ఇదే సమయంలో కొన్ని అక్రమ యాప్స్ కూడా మార్కెట్లోకి వచ్చి యువతను ఆర్థికంగా నాశనం చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ యాప్‌లు ప్రజల ఆర్థిక స్థితిని చేజార్చడంతో పాటు, అనేక మందిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాయి. అందుకే ఇలాంటి యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.