calender_icon.png 13 January, 2026 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాన్‌లో సంక్షోభం!

01-01-2026 12:00:00 AM

పశ్చిమాసియా దేశం ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. అమెరికా ఆంక్షలు, అణ్వస్త్ర కార్యకలాపాలు, సుప్రీం లీడర్ ఖమేనీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వెరసి ఇరాన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశాయి. డాలర్‌తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ రోజురోజుకు పతనమవుతున్నది. ఓపెన్ మార్కెట్‌లో బుధవారం ఒక డాలర్‌తో పోల్చితే ఇరాన్ కరెన్సీ విలువ 14.2 లక్షల రియాల్స్‌కు పడిపోయింది. సాధారణంగా ఇరాన్‌లో మూడు రకాల కరెన్సీ ఎక్సేంజీలను వినియోగిస్తారు.

అధికారిక, కమర్షియల్, ఫ్రీ-మార్కెట్ ధరల విధానాన్ని ఇరాన్ అనుసరిస్తోంది. అధికారి ఎక్సేంజీలో ఒక అమెరికన్ డాలర్ విలువ 42 వేల రియాల్స్‌గా ఉంది. దీంతో నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో సాధారణ ప్రజానీకం ఆందోళన బాట పట్టారు. మంగళవారం దేశవ్యాప్తం గా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. మరి ఇరాన్‌లో ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణాలు అనేకం. ముఖ్యంగా అణు ఆంక్షల ప్రభావం ఇరాన్‌పై తీవ్రంగా ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్‌పై ఆంక్షలతో విరుచుకుపడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సైతం ఇరాన్‌పై అణు ఆంక్షలను పునరుద్ధరించింది. దీంతో విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు పూర్తిగా స్తంభించిపో వడంతో పాటు ఆయుధాల ఒప్పందాలు నిలిచిపోయాయి. బయటి సమస్యలకు తోడు ఇరాన్‌ను అంతర్గత సమస్యలు వేధిస్తున్నాయి. అవినీతి, అస మర్థ పాలనతో పాటు పవర్ గ్రిడ్ వైఫల్యంతో దేశంలో గంటలపాటు బ్లాక్‌అవుట్‌లను చవిచూస్తోంది.

ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ఇంధన సంక్షోభం వెంటాడుతోంది. అధిక ద్రవ్యోల్బణం కూడా ఇరాన్ సంక్షోభానికి ఒక కారణం. 2025 చివరి నాటికి ఇరాన్‌లో ద్రవ్యోల్బణం రేటు సుమారు 40 శాతంగా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో శత్రు త్వం ఇరాన్‌ను అందఃపాతాళానికి నెట్టివేశాయి. 2015లో అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇరాన్ కరెన్సీ విలువ ఒక డాలరుకు 32 వేల రియాల్స్‌గా ఉంది.

ట్రంప్ రెండో దఫా అధ్యక్షుడయ్యాక అణు ఒప్పందం రద్దు చేసుకొని, ఆంక్షలు కఠినం చేయడంతో ఇరా న్ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తున్నది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నియంతృత్వ పాలనపై ప్రజల్లో కొన్నాళ్లుగా వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నది. ‘మత గురువులు అధికారాన్ని వదిలి వెళ్లిపోవా లి.. నియంతృత్వం అంతరించాలి’ అనే నినాదాలు ఇరాన్‌ను అట్టుడికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

ఇప్పటివరకు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా కొనసాగిన మహ్మద్ రెజాను తొలగించిన ప్రభుత్వం.. ఆ బాధ్య తలను ఆ దేశ ఆర్థికవేత్త అబ్దోల్‌నాసర్ హెమ్మతికి తిరిగి అప్పగించింది. 2018 నుంచి 2021 వరకు సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌గా అబ్దోల్‌నాసర్ పలు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇరాన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల మంత్రిగా కొనసాగిన ఆయన్ను ఈ ఏడాది మార్చిలో విధుల్లో లోపాలున్నాయంటూ ఖమేనీ తొలగించారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఇరాన్‌ను అబ్దోల్‌నాసర్ తిరిగి గాడిన పెడతారా అన్నది చూడాలి!