calender_icon.png 21 August, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం జాతరకు 150 కోట్లు

21-08-2025 01:27:52 AM

-ఉత్తర్వులు జారీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ

-కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క -సారలమ్మ మహా జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళాగా పిలిచే ఈ మహోత్సవం విజ యవంతంగా సాగేందుకు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది.

ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభ వోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. నిధుల మంజూరు పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆదివాసీల గౌరవానికి ప్రతీకగా పేర్కొన్నారు. మేడారం మహా జాతర కోసం రూ.150 కోట్లు మంజూరు చేయడం, ఆదివాసీ గిరిజనుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగనుందని వెల్లడించారు.