21-08-2025 01:27:36 AM
నిబంధనలను అతిక్రమించిన ఫెర్టిలైజర్ షాపుల లైసెన్సులు సస్పెండ్
మహబూబాబాద్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): యూరియా కృత్రిమ కొరత పై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. స్వయంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ , డీఈవో విజయనిర్మల, ఏడిఏ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ, టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి జిల్లాలోని మరిపెడ, కురవి, దంతాలపల్లి, మహబూబాబాద్ పట్టణంలో ఎరువుల విక్రయ షాపులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా షాపులో నిలువ ఉన్న ఎరువుల బస్తాలను స్వయంగా కలెక్టర్ లెక్కించి స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మరిపెడ డివిజన్ పరిధిలోని కురవి, మరిపెడ, చిన్న గూడూరు, డోర్నకల్ మండలాల్లోని బాలాజీ ఫెర్టిలైజర్స్, వీర వెంకట సత్యనారాయణ ఫెర్టిలైజర్స్, శ్రీ మణికంఠ ఫెర్టిలైజర్, తేజస్విని ఫెర్టిలైజర్స్, వినయ్ ఫెర్టిలైజర్స్, శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్,
రైతు మిత్ర ఫర్టిలైజర్స్ అనే ఏడు ఎరువుల షాపుల నిర్వాహకులు యూరియా కొరతను అధిగమించే విధంగా అధికారుల ఆదేశాల మేరకు లోబడి నిర్వహించడం లేదని గుర్తించి ఫర్టిలైజర్ యాక్ట్ ప్రకారం లైసెన్సులు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పి ఓ ఎస్ యంత్రాల ద్వారానే పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు ఆధారంగా రైతులకు యూరియా పంపిణీ చేయాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుని లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. పెదవులకు కొరతలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ వివరించారు.