calender_icon.png 15 September, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.30,000 కోట్లకు ఆభరణాల అమ్మకాలు

30-10-2024 12:00:00 AM

ఈ ధనతెరాస్, దీపావళి 

ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనా

కోల్‌కతా, అక్టోబర్ 29: ధరలు రికార్డుస్థాయిలో ఉన్నా ఈ ధనతెరాస్, దీపావళి పండుగల సందర్భంగా దేశంలో బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు రూ. 30,000 కోట్లను మించుతాయని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బంగారం సురక్షితమైన ఆస్తి అన్న భావన వినియోగదార్లలో పెరగడం, పుత్తడితో పోలిస్తే తక్కువ ధరకు లభించే వెండికి ప్రజల్లో ఆదరణ పుంజుకోవడం, దీనికి తోడు ఈ తెల్ల లోహానికి పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఈ దీపావళికి దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాల పరిమాణం నిరుడుతో పోలిస్తే కాస్త తగ్గినప్పటికీ, విలువ రీత్యా విక్రయాలు 10-15 శాతం వృద్ధిచెందుతాయని నిపుణులు చెపుతున్నారు. గత పండుగ సీజన్ నుంచి ఇప్పటివరకూ వెండి భారీగా 40 శాతంపైగా రాబడుల్ని ఇవ్వగా, బంగారం 23 శాతం లాభాల్ని తెచ్చిపెట్టింది. 

డైమండ్స్ నుంచి గోల్డ్ వైపు షిఫ్ట్

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో బంగారం ధర పెరుగుదల కొనసాగుతుందని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈస్ర న్ రీజియన్ కౌన్సిల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో వజ్రాల నుంచి బంగారంవైపునకు వినియోగదారులు, ఇన్వెస్టర్లు షిఫ్ట్ అవుతున్నారని తెలిపింది.

ల్యాబ్ ల్లో ఉత్పత్తి చేసే వజ్రాలు వస్తున్నందున, సహజ వజ్రాలకు డిమాండ్ తగ్గుతున్నదని వెల్లడించింది. బంగారం ఆభరణాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ ధనతెరాస్, దీపావళి పండుగలకు రూ. 30,000 కోట్లను మించి అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్టు అంకుర్‌హతి జెమ్స్ అండ్ జ్యువెలరీ మాన్యుఫాక్చరర్స్ ప్రెసిడెంట్ అశోక్ బెన్‌గాని చెప్పారు.

అధిక ధరల కారణంగా అమ్మకాల పరిమాణం 12-15 శాతం మేర తగ్గవచ్చని, అయితే విలువ ప్రకారం అమ్మకాలు 10-13 శాతం పెరుగుతాయని సెన్కో గోల్డ్ ఎండీ, సీఈవో సువంకర్ సేన్ అంచనా వేశారు. ఈ పండు క్కి కొంతమంది బ్రైడల్ జ్యువెలరీని కొంటుండగా, మరికొందరు లైట్‌వెయిట్, ఎవిరిడే ఆభరణాలవైపు మొగ్గుచూపిస్తున్నారని అంజలి జ్యువెలర్స్ అధినేత చెప్పారు.

దేశీయ నిల్వల్ని మరో 102 టన్నులు పెంచిన ఆర్బీఐ

ఆర్బీఐ దేశ, విదేశాల్లో ఉంచే బంగారం నిల్వల్ని వివిధీకరించే ప్రక్రియలో భాగంగా  ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌సెప్టెంబర్ ప్రధమార్థంలో దేశీయంగా అట్టిపెట్టే నిల్వల్ని మరో 102 టన్నులు పెంచింది. మంగళవారం కేంద్ర బ్యాంక్ వెల్లడించిన సమాచారం ప్రకారం స్థానిక సేఫ్‌ల్లో ఆర్బీఐ భద్రపర్చిన పుత్తడి నిల్వలు సెప్టెంబర్ ముగిసేటప్పటికి 510.46 మెట్రిక్ టన్నులకు చేరాయి.

2024 మార్చి 31 నాటికి ఇవి దేశీయ సేఫ్‌ల్లో ఆర్బీఐ బంగారం నిల్వలు 408 మెట్రిక్ టన్నుల మేర ఉన్నాయి. దేశ, విదేశాల్లో ఉన్న మొత్తం ఆర్బీఐ నిల్వలు ఈ ఆరునెలల్లో 32 టన్నులు పెరిగి 854.73 టన్నులకు చేరినట్లు ఇటీవల ఒక నివేదికలో రిజర్వ్‌బ్యాంక్ వెల్లడించింది. 

క్రమేపీ విదేశీ నిల్వల తరలింపు

విదేశాల్లో ప్రత్యేకించి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వాల్ట్స్‌లో భద్రపర్చిన బంగా రం నిల్వల్ని ఆర్బీఐ క్రమేపీ కొద్ది ఏండ్లు గా దేశంలోకి తీసుకువస్తున్నది. ముంబై, నాగపూర్‌ల్లోని సేఫ్‌వాల్ట్స్‌లోకి తరలిస్తున్నది. 2023 ఆర్థిక సంవత్సరంలో యూకే నుంచి ఆర్బీఐ 100 టన్నుల బంగారాన్ని భారత్‌లోకి తీసుకు వచ్చిం ది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సేఫ్ కస్టడీలో 324 టన్నుల బంగారం ఉన్నదని, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్స్ (బీఐఎస్)ల వద్ద 20.26 టన్ను ల గోల్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. 

హైదరాబాద్‌లో మళ్లీ రూ.80వేల పైకి తులం ధర

ప్రపంచ మార్కెట్లో సరికొత్త రికార్డు

ధనతెరాస్, దీపావళి దగ్గరకొస్తున్న సమయంలో కొనుగోలుదార్లకు కొద్దిపాటి ఊరటనిచ్చినట్లు కన్పించిన బంగా రం ధర మళ్లీ పెరిగింది. రానున్న యూఎస్ అధ్యక్ష ఎన్నికల పట్ల అనిశ్చితితో ప్రపంచ మార్కెట్లలో పసిడి తిరిగి కొత్త రికార్డు గరిష్ఠస్థాయికి చేరడంతో    మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పుత్తడి ఒక్క రోజు విరామానంతరం రూ. 80 వేల స్థాయిని దాటే సింది.

24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 650 పెరిగి రూ.80,450 వద్దకు చేరింది. సోమవారం ఇది రూ. 79,800 వద్దకు తగ్గిన సంగతి తెలిసిందే. ఢిల్లీ బులియన్ మార్కెట్లో ఇది రూ. 81,400 స్థాయికి ఎగిసింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర  తాజాగా 24 డాలర్ల మేర పెరిగి 2,780 డాలర్ల వద్ద నూతన రికార్డును నెలకొల్పింది.

ఈ ప్రభావంతో దేశీయ  మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం మంగళ వారం రాత్రి రూ. 700పైగా పెరిగి రూ. 79,200 వద్దకు చేరింది. ఇన్వెస్టర్ల డిమాండ్‌కు తోడు ధనతెరాస్ రోజున మరింతగా కొనుగోళ్లు జరుగుతాయన్న అంచనాలతో దేశీయ మార్కెట్లో ధర పుంజుకోవడానికి మరో కారణమని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు.

వెండి ధర మాత్రం స్థిరంగా నిలిచింది. ఈ విలువైన లోహం కేజీ ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 1,06,900 పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 34.60 డాలర్ల సమీపంలో కదులుతున్నది.