calender_icon.png 15 September, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజూ ర్యాలీ

30-10-2024 12:00:00 AM

  1. బ్యాంకింగ్ షేర్ల జోరు
  2. సెన్సెక్స్ 368 పాయింట్లు జంప్
  3. 24,400 పైన నిఫ్టీ ముగింపు

ముంబై, అక్టోబర్ 29: గత వారం తీవ్ర పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్ ఈ వారం వరుసగా రెండో రోజూ ర్యాలీ జరిపింది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లో కూరుకుపోయిన మార్కెట్ మధ్యాహ్న సెషన్ నుంచి బ్యాంకింగ్ షేర్లు నాటకీయంగా జరిపిన ర్యాలీతో గట్టెక్కింది. 

ఉదయం సెషన్‌లో 583 పాయింట్లు పతనమై 79,421 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన సెన్సెక్స్ మధ్యాహ్న సెషన్ నుంచి ఆ నష్టాల్ని పూడ్చుకోవడంతో పాటు 80,450 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. కనిష్ఠస్థాయి నుంచి 1,000 పాయింట్లకుపైగా సెన్సెక్స్ ఎగిసింది. చివరకు 364 పాయింట్ల లాభంతో 80,369 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 200 పాయింట్ల పతనాన్ని చవిచూసి 24,140  పాయింట్లకు తగ్గిన అనంతరం 340 పాయింట్ల వరకూ పెరిగి 24,484 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 128 పాయింట్ల లాభంతో 24,400 పాయింట్ల ఎగువన 24,467 పాయింట్ల వద్ద నిలిచింది. సోమవారం సెన్సెక్స్ 602 పాయింట్లు, నిఫ్టీ 158 పాయింట్ల చొప్పున పెరిగాయి.

అంతర్జాతీయ సంకేతాల సానుకూలత, దేశీయ సంస్థల భారీ కొనుగోళ్లు మార్కెట్ టర్న్ ఎరౌండ్ కావడానికి కారణమని ట్రేడర్లు తెలిపారు. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్‌లు గ్రీన్‌లో ముగియగా, షాంఘై నష్టపోయింది. యూరప్ సూచీలు లాభాలతో క్లోజయ్యాయి. 

పీఎస్‌యూ బ్యాంక్‌ల దన్ను

క్రితం వారం నష్టాల నుంచి నిఫ్టీ రికవరీ వరుసగా రెండో రోజూ కొనసాగిందని, బ్యాంక్‌లు, ప్రత్యేకించి పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు రెండో ట్రేడింగ్ సెషన్‌లోనూ మంచి ప్రదర్శన కనపర్చాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. నెగిటివ్‌గా ఉన్న మార్కెట్‌ను బ్యాంకింగ్ హెవీవెయిట్లు రిబౌండ్ చేశాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. 

ఎస్బీఐ టాపర్

సెన్సెక్స్ ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) షేరు 5 శాతంపైగా పెరిగి రూ.832 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్,  లార్సన్ అండ్ టుబ్రో,  బజాజ్ ఫైనాన్స్, టైటాన్‌లు 3 శాతం వరకూ పెరిగాయి.

మరోవైపు నిరుత్సాహకర ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన మారుతి సుజుకి 3.80 శాతం, టాటా గ్రూప్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ 4 శాతం చొప్పున క్షీణించాయి. సన్‌ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రాలు 1.5 శాతం వరకూ తగ్గాయి.