నాచగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
గజ్వేల్, జూన్ 21: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వాహణాధికారి బెల్లంకొండ రంగాచారి పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దర్శనం, ప్రసాదాల పంపిణీ, తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రోజంతా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.






