26-01-2026 07:57:25 PM
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సాంప్రదాయ నృత్యాలు భారతీయ సంస్కృతికి మూలాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేడుకల కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంప్రదాయ నృత్యాలు భారతీయ సనాతన సంస్కృతికి మూలాలని తెలిపారు.
విద్యార్థులు చదువుతోపాటు తమకు అభిరుచి ఉన్న రంగాలలో రాణించాలని, తల్లితండ్రుల పేరు, సమాజం పట్ల గౌరవభావం, దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ పట్టణంలోని కేరళ ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థిని విశ్వజ, ఆసిఫాబాద్ పట్టణం సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థిని సాన్విక భరతనాట్యం, ఆసిఫాబాద్ మండలం బూర్గుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు "ఇదే మన భారతదేశం", ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ప్రీ మెట్రిక్ బాలుర వసతి గృహం విద్యార్థులు సాంప్రదాయ గొండి పాటలపై చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్ళు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాల్గొన్నారు.