calender_icon.png 5 January, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటేస్తున్న కల్వర్టులు!

05-01-2026 12:00:00 AM

  1. రక్షణ గోడలు లేని కల్వర్టులు

అధికారుల పర్యవేక్షణ లేమి..

పెరుగుతున్న ప్రమాదాలు

అశ్వాపురం, జనవరి 4 (విజయక్రాంతి): అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రహదారులు నిజంగా ప్రజలకు భద్రత కల్పిస్తున్నాయా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మణుగూరుకొత్తగూడెం ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టుల పరిస్థితి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానంగా నిలుస్తోంది. రహదారి పక్కన నిర్మించిన కల్వర్టులు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారడం పాలనా వైఫల్యానికి ప్రత్యక్ష ఉదాహరణ.

కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన కల్వర్టులు, రక్షణ గోడలు లేకుండా వదిలేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలు అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తున్నాయి. రాత్రి వేళల్లో, పొగమంచు కమ్ముకున్న సమయంలో ఈ మార్గం మరణపు ఉచ్చులా మారుతోంది. అయినా సరే, సంబంధిత ఆర్ అండ్ బి శాఖ అధికారులు మాత్రం స్పందన లేకుండా మౌనం వహిస్తున్నారన్న.

ఆరోపణలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రమాదం జరిగాక స్పందించడం పాలన కాదు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవడమే నిజమైన బాధ్యత. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే నిర్లక్ష్యానికి ఇకనైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. మణుగూరుకొత్తగూడెం రహదారి విషయంలో ఆర్ అండ్ బి శాఖ తక్షణమే స్పందించకపోతే, ప్రజా ఆగ్రహం ఉప్పెనలా ఎగసిపడే ప్రమాదం ఉంది.

రాత్రివేళల్లో మరింత ముప్పు..

ప్రత్యేకంగా రాత్రి వేళల్లో, పొగమంచు కమ్ముకున్న సమయంలో ఈ రహదారి ప్రయాణికులకు మరణపు ఉచ్చులా మారుతోంది. రోడ్డుకు పక్కనే లోతైన కాలువలు ఉన్నప్పటికీ అవి స్పష్టంగా కనిపించకపోవడం వల్ల వాహనం కాస్త అదుపు తప్పినా నేరుగా కాలువలో పడే ప్రమాదం ఉంది. నిత్యం భారీ వాహనాల రాకపోకలు సాగుతున్న ఈ మార్గంలో ద్విచక్ర వాహనదారులు, రైతులు, పాదచారులు భయంతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రజాధనం దుర్వినియోగమా?

కల్వర్టుల నిర్మాణ నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా నిర్మించినట్లు చెప్పుకునే కల్వర్టులు తక్కువ కాలంలోనే దెబ్బతినడం వెనుక అవినీతి, నాసిరకం పనులే కారణమా? అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. పనుల నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు కేవలం బిల్లులపై సంతకాలు చేసి చేతులు దులుపుకున్నారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాజకీయ నాయకుల హెచ్చరిక..

ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఓరుగంటి బిక్షమయ్య తీవ్రంగా స్పందించారు. మణుగూరుకొత్తగూడెం ప్రధాన రహదారి ప్రజలకు అత్యంత కీలకమైన మార్గం. కల్వర్టుల నిర్మాణాల్లో తీవ్ర లోపాలు ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది పూర్తిగా ఆర్ అండ్ బి శాఖ నిర్లక్ష్యం. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ప్రజా ఉద్యమానికి సిద్ధం అవుతాం. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.

వాహనదారుల ఆవేదన..

మేము రోజూ ఈ రహదారిపైనే ప్రయాణం చేస్తుంటాం. రోడ్డుకు పక్కన ఉన్న కల్వర్టులు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. కొన్ని చోట్ల స్లాబ్లు విరిగిపోయి లోతైన కాలువలు కనిపించడం లేదు. రాత్రి వేళల్లో ప్రమాదం జరిగితే ప్రాణాలతో బయటపడతామా అనే భయం వెంటాడుతోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని రక్షణ గోడలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి అని కోరుతున్నారు.

ప్రమాదం జరిగాకే చర్యలా?

ఇప్పటికే కొన్ని చోట్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించకపోవడం మరింత ఆగ్రహానికి కారణమవుతోంది. ఘోర ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? లేక మళ్లీ విచారణ కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా? అనే అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి.

ప్రజల ప్రాణాల రక్షణపై కనీస శ్రద్ధ చూపని ఆర్ అండ్ బి శాఖ తక్షణమే స్పందించి, కల్వర్టులకు రక్షణ గోడలు నిర్మించడం, దెబ్బతిన్న స్లాబ్లను మార్చడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగాక కాదు ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.